లోక్ సభ ఎన్నికల్లో 13 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోన్న కాంగ్రెస్ పార్టీ, సీట్ల సంఖ్యపై ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చేందుకు ఇంటర్నల్ సర్వే చేపట్టింది. హస్తం పార్టీకి ఈ ఎన్నికల్లో ఏయే వర్గాలు మద్దతుగా నిలిచాయి..? అనే అంశాలపై సర్వే నిర్వహించిన పార్టీ వర్గాలు, వీటిని క్రోడీకరించి రెండు రోజుల్లో రిపోర్ట్ ను రెడీ చేయనున్నట్లు సమాచారం. వీటి ఆధారంగా రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే సీట్లపై ఆ పార్టీ తుది నిర్ణయానికి రానుంది.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించగా… ఈ సర్వేను అనాలసిస్ చేసేందుకు 50 మంది కో అర్దినేటర్లను నియమించారు. ప్రతి పార్లమెంట్ కు ముగ్గురు చొప్పున ఎంపిక చేసిన పార్టీ వర్గాలు, సర్వేపై విశ్లేషణ చేసి రాష్ట్ర నాయకత్వానికి రిపోర్ట్ అందించనున్నారు. కాంగ్రెస్ కు ఏమేర ఓట్లు రాలాయి..? అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన వర్గాలు పార్లమెంట్ ఎన్నికల్లో సపోర్ట్ చేశాయా..? ఒకవేళ దూరమైతే ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాయి..? అని కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ తేల్చనుంది.
రాష్ట్రంలోని బూత్ ల వారీగా ఓటర్ల జాబితాను సేకరించి… బూత్ ఏజెంట్ల పరిశీలన అనంతరం రిజల్ట్స్ పై నివేదికను రూపొందించనున్నారు. అయితే, ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపగా, మెజార్టీ బీసీలు, ఓసీలు బీజేపీ వైపు నిలిచినట్లుగా ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ అంచనా వేస్తోంది. దీంతో ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చేందుకు ఈ సర్వే దోహదం చేస్తోందని పార్టీ వర్గాలు అభిప్రాయానికి వచ్చాయి.
పైగా, ఈ సర్వే లోకల్ బాడీ ఎన్నికలకు కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే, ఏయే వర్గాలు కాంగ్రెస్ పై అసంతృప్తితో ఉన్నాయో తెలుసుకోవడం ద్వారా ఆ వర్గాలను ఆకర్షించేందుకు వెసులుబాటు ఉంటుందని అధికార పార్టీ భావిస్తోంది. అందుకే ద్విముఖ వ్యూహంతో ఈ సర్వే ప్లాన్ చేసినట్లుగా కనబడుతోంది.