ఓ వైపు మేమే అధికారంలోకి వస్తామని ఇండియా కూటమి ధీమా వ్యక్తం చేస్తుండగా… ప్రధాని మోడీ, అమిత్ షా మాత్రం చార్ సౌ పార్ నినాదాన్ని వదిలేసి ఇండియా అధికారంలోకి వస్తే అంటూ ప్రస్తావించడం చర్చనీయాంశం అవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మోడీ, షా ల ద్వయం ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది.
కాంగ్రెస్ పై విమర్శలు చేయాలంటే గాంధీ ఫ్యామిలీని మాత్రమే టార్గెట్ చేసి… అరవై ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించే మోడీ, షాలు గడిచిన కొద్ది రోజులుగా వారు చేస్తోన్న విమర్శల్లో మార్పు కనిపిస్తుండటం సరికొత్త అనుమానాలకు అద్దం పడుతోంది. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అంటూ మాట్లాడటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక అసలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే చాన్సే లేదని ఆ పార్టీని తీసిపారేసిన బీజేపీ, తమకు 400 సీట్లు పక్కా అని ధీమా వ్యక్తం చేసి ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే తరహాలో వ్యాఖ్యలు చేస్తుండటం చర్చకు దారితీస్తోంది.
గడిచిన నాలుగు విడతలో ఇండియా కూటమి మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంటుందని, చివరి దశ వరకు ఇదే ప్రభావాన్ని కాంగ్రెస్ కూటమి చూపితే బీజేపీ హ్యాట్రిక్ ఆశలు గల్లంతేననే విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మోడీ , షాలు ప్లాన్ మార్చి సెంటిమెంట్ ను రగిల్చే పీవోకే అంశంతోపాటు, కాంగ్రెస్ పవర్ లోకి వస్తే ఏడాదికొ ప్రధాని మారుతారంటూ విమర్శలు చేస్తున్నారనే వాదనలు వ్యక్తం అవుతున్నాయి.
దేశవ్యాప్తంగా రోజురోజుకు ఇండియా కూటమికి ఆదరణ పెరుగుతున్నదని గ్రహించే ప్రధాని ఆందోళనతోనే గతానికి భిన్నంగా కాంగ్రెస్ పై ఆరోపణలు, విమర్శల వర్షం కురిపిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మోడీ, షా వ్యాఖ్యలు చూస్తుంటే కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు కూడా నిజం అనిపించేలా ఉన్నాయన్న టాక్ నడుస్తోంది.