వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తూ వైరల్ అయిన అనేక వీడియోల్లో వ్యక్తులు ఎవరో చాలా మందికి తెలియదు. మాములుగా వీడియో వైరల్ అయితే .. ఆ చుట్టుపక్కల వారి ద్వారా అందరికీ తెలిసిపోతుంది. కానీ వైసీపీకి మద్దతుగా సామాన్యులగా చెప్పుకుని మాట్లాడిన వారు ఎక్కడ ఉంటారో.. అసలు బయటకు రాలేదు. ఆ సీక్రెట్ ఏంటో వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి బయట పెట్టారు. ఐ ప్యాక్ ఆఫీసులో ఆయన తీసుకున్న సెల్ఫీల్లో వాళ్లంతా కనిపించారు మరి. ఆ సామాన్యులు.. వైసీపీ ఫ్యాన్స్ అంతా ఐ ప్యాక్ ఉద్యోగులు.
వైజాగ్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో వైరల్ అయిన ముగ్గురు మహిళలు ఐ ప్యాక్ ఆఫీసులో !
వైజాగ్ జగన్ ముక్కీ మూలిగి ఓ ఇన్వెస్టర్స్ సదస్సు నిర్వహించారు. దానికి ఎవరూ రాలేదు. ఆల్రెడీ పెట్టుబడులు పెట్టిన వారితో మ .. మ అనిపించారు. అయితే చాలా మంది వచ్చారని చెప్పించడానికి వేషాలు వేసి చాలా మందిని సమ్మిట్ ప్రాంగణలోకి వదిలారు. అలా సూట్లు వేసుకున్న ముగ్గురు మహిళలు ప్రాంగణంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా వెళ్తున్న ఫోటో వైరల్ అయింది. వారు ఎందుకు వచ్చారు.. ఏమి పెట్టుబడి పెట్టాలనుకున్నారు.. ఏ ప్రతిపాదనలు ఇచ్చారో ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు. తర్వాత కూడా ఎవరికీ చెప్పలేదు. చూడటానికే డ్రెస్సింగ్ స్టైల్ చాలా ఎబ్బెట్లుగా ఉన్న వారు.. ఏమి పెట్టుబడులు పెట్టారోనని చాలా మంది ఆసక్తిగా చర్చించుకుంటూ ఉంటారు. వారి ఆచూకీ ఇప్పటి వరకూ ఎవరికీ దొరకలేదు.. తొలి సారి జగన్మోహన్ రెడ్డి వారిని బయట ప్రపంచానికి పరిచయం చేశారు. వారు ఐ ప్యాక్ ఐఫీసులో ఉద్యోగులగా జగన్ తో కలిసి ఫోటో దిగారు. ఇప్పుడీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వీళ్లే కాదు.. దాదాపుగా అంతా ఆర్టిస్టులే !
ఈ ముగ్గురు మహిళా మణులే కాదు.. మరో రెండు వీడియోల్లో వైరల్ అయిన యువతి, మహిళ కూడా ఐ ప్యాక్ ఉద్యోగులే. ఎవరైతే ఏంటి జగనే ముఖ్యం అన్నట్లుగా మాస్ గా మాట్లాడిన ఓ అమ్మాయి.. ఐ ప్యాక్ ఆఫీసులోనే కనిపించింది. ఐ ప్యాక్ ఆఫీసులో స్వీపర్ గా పని చేసే మహిళతో కూడా సామాన్యురాలిగా వేషం వేయించి.. తనకు ఎంతో లబ్ది కలిగిందని చెప్పి వీడియోలు తీయించింది ఐ ప్యాక్. ఐ ప్యాక్ ఆఫీసులో జగన్ తీసుకున్న సె్ల్ఫీ ఇప్పుు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వారి దొంగ ప్రచారం గుట్టును అంతా బయట పెడుతోంది.
సర్వం ఫేక్ ఐ ప్యాక్ స్టైల్.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐ ప్యాక్ ఆఫీసుకు వెళ్లి వాళ్లకు లెక్చర్ ఇచ్చారు. గెలుస్తున్నామని భరోసా ఇచ్చారు. ఆ మాట చెప్పాల్సింది ఐ ప్యాక్ వాళ్లు అని జగన్ అనుకోలేదు. తాను అనుకున్నది చెప్పేశారు. అంత వరకూ బాగానే ఉంది.. కానీ అంతా ఫేక్ అని తెలిసి కూడా ఆయన ఎందుకు అలా డ్రామాలేశారో ఐ ప్యాక్ వారికీ అర్థం కావడం లేదు. జగన్ కోసం పని చేసిన ఐ ప్యాక్ సిబ్బందికి ఇక్కెడెవరికి ఓట్లు ఉండవు. వారంతా తెలుగు రాని ఇతర రాష్ట్రాలకు చెందినవారే. రాజకీయం అంంటే ఫేక్ చేయడం అనుకుని ఫేక్ పాలిటిక్స్ చేస్తూ బతికేస్తున్నారు. ఇప్పుడు మరోసారి అదే విషయం బయట పడింది.