‘డీజే టిల్లు’తో సిద్దు జొన్నలగడ్డ కెరీర్ మొత్తం మారిపోయింది. ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశాడు. ‘టిల్లు స్క్వేర్’ కూడా హిట్టవ్వడంతో ఇప్పుడు సిద్దు డేట్లు హాట్ కేకుల్లా మారిపోయాయి. సిద్దుతో సినిమా తీయాలంటే ఇప్పుడు రూ.15 కోట్లు సమర్పించుకోవాల్సిందే. తన రెమ్యునరేషన్ అంతగా పెరిగింది. ‘టిల్లు స్క్వేర్’కి ముందు రూ.5 కోట్లు తీసుకొన్న జొన్నలగడ్డ.. ఆ తరవాత తన పారితోషికాన్ని మూడు రెట్లు పెంచేశాడు. నిజంగా ఇది ఊహించని మార్పు. నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోల రూ.20 నుంచి రూ.25 కోట్ల మధ్య ఊగిసలాడుతున్నారు. అయితే ఆ రేంజ్కి రావడానికి టైమ్ పట్టింది. అయితే సిద్దు మాత్రం రెండే రెండు సినిమాలతో రూ.15 కోట్లకు చేరుకొన్నాడు.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు ‘జాక్’ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కోసం తాను అందుకొన్న పారితోషికం రూ.5 కోట్లే. ఈలోగా ‘టిల్లు స్క్వేర్’ వచ్చి హిట్టయ్యింది. అందుకే రూ.15 కోట్లకు పెంచేశాడు. సిద్దుతో సినిమా అంటే మార్కెట్ పరంగా చూసుకోవాల్సిన పనిలేదు. కాకపోతే… ఒకటే రిస్క్. తన నుంచి ఇంకా టిల్లు టైప్ బాడీ లాంగ్వేజే ఆశిస్తుంటారు ప్రేక్షకులు. కానీ ప్రతీ సినిమాలోనూ అది వర్కవుట్ కాదు. సిద్దు సెటిల్డ్ గా నటిస్తే జనం చూస్తారా, వాళ్లకు నచ్చుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. టిల్లు బాడీ లాంగ్వేజ్ నుంచి బయటకు వస్తే… సిద్దుని ఎలా ఆదరిస్తారు? అనేదానిపైనే సిద్దు కెరీర్ ఆధార పడి ఉంది. `జాక్`లో సిద్దుని భాస్కర్ ఎలా చూపించనున్నాడో మరి.