రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా, ఏపీ సీఎం జగన్ వైఖరి కూడా అదే తరహాలో ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు హింసాత్మక ఘటనలతో రాష్ట్రం భగ్గుమంటుంటే వాటిపై దృష్టి పెట్టకుండా విదేశీ పర్యటనకు జగన్ వెళ్తుండటంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.
రాష్ట్రంలో టీడీపీ – వైసీపీ కార్యకర్తలు ఘర్షణలకు పాల్పడుతూ విధ్వంసం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. పలు ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. వీటిని అదుపు చేయాల్సిన సీఎం… బాధ్యతను పక్కనపెట్టి విదేశాలకు పయనం అవుతుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అల్లర్లతో రాష్ట్రం అట్టుడుకుతుంటే జగన్ మాత్రం తనకేమి పట్టన్నట్లుగా తప్పించుకుంటున్నారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
జగన్ విదేశీ పర్యటన ముందస్తుగా ఖరారు చేసుకున్నదే అయినా, సీఎం హోదాలో రాష్ట్రానికి పెద్దన్నలా వ్యవహరించాల్సిన జగన్ ఈ ఆపత్కాల సమయంలోనూ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళడంపై విమర్శలు వస్తున్నాయి. శాంతి భద్రతలపై సమీక్షిస్తూ , పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు చొరవ చూపాల్సిన ముఖ్యమంత్రి తనకేమి పట్టనట్లుగా ఎంచక్కా విదేశాలకు వెళ్ళడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.