హింసాత్మక ఘటనలతో విధ్వంసకాండ కొనసాగుతోన్న పల్నాడు జిల్లాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , ఆయన సోదరుడు అజ్ఞాతంలోకి వెళ్ళారు. గురువారం గృహ నిర్బంధంలోనున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాత్రి నుంచి కనిపించకపోవడంతో ఆయన ఎక్కడికి వెళ్లి ఉంటారని వైసీపీ శ్రేణులు సైతం ఆందోళన చెందుతున్నాయి.
కారంపూడి, మాచర్లలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా చేపట్టిన తనిఖీల్లో గురువారం పిన్నెల్లిలో పెట్రోల్ బాంబులను గుర్తించారు. ఎన్నికల వేళ దాడుల కోసమే ఈ బాంబుల్ని తయరు చేశారా..? అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ బాంబుల తయారీ వెనక ఎవరి ప్రమేయం ఉంది..? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టిన తరుణంలో పిన్నెల్లి బ్రదర్స్ అజ్ఞాతంలోకి వెళ్ళడానికి అరెస్ట్ భయమే కారణమా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రధానంగా కారంపూడి అల్లర్ల నేపథ్యంలో అరెస్టుల భయంతో పిన్నెల్లి బ్రదర్స్ అజ్ఞాతంలోకి వెళ్ళారని ప్రచారం జరుగుతోంది.
గన్ మెన్స్ వెంట లేకుండా, ఫోన్ స్విచ్చాఫ్ చేసుకొని పిన్నెల్లి బ్రదర్స్ ఎక్కడికి వెళ్ళారు..? ఎందుకు వెళ్ళారు..? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణా ఆచూకీని గుర్తుంచేందుకు పోలీసులు పట్టణంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు మాచర్లలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.