అయిందేదో అయిపోయింది.. ఇక తప్పు దిద్దుకో అని ఈసీని హెచ్చరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈసీ ఏం తప్పు చేసిందో.. ఎలా దిద్దుకోవాలనుకుంటున్నారో ఆయన పరోక్షంగానే తన మాటలతో సందేశం పంపారు. అదేమిటంటే కౌంటింగ్ లో వైసీపీ అక్రమాలకు సహకరించడం. పోలింగ్ సమయంలో సహకరించలేదన్న ఫీలింగ్ లో ఉన్నారేమో కానీ.. కౌంటింగ్ లో సహకరించాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. వైసీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈసీని బెదిరిస్తున్నట్లుగా మాట్లాడారు.
కౌంటింగ్లో అక్రమాలు జరిగితే ఎదుర్కొంటామని .. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ఈసీ తప్పు సరిదిద్దుకుంటే మంచిందని సలహా ఇచ్చారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలంటే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాను తొలగించాలని డిమాండ్ చేశారు. టీడీపీ కొంతమంది పోలీసులను తమ ఏజెంట్లుగా మార్చుకుందని ఆరోపించారు. ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని కోరుకుంటున్నాం. ఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా ఉంటే ఇంత విద్వంసం అల్లర్లు జరిగేవి కావని చెప్పుకొచ్చారు.
వైసీపీ నియమించిన అధికారుల్ని కాదని…తమ వారిని కౌంటింగ్ సమయంలో నియమించాలని సజ్జల కోరుతున్నట్లుగా ఉంది. సజ్జల వ్యవహారం చూస్తూంటే.. కౌంటింగ్ లో వైసీపీ ఓడిపోయే ఫలితాలు వచ్చే సమయంలో గందరగోళం సృష్టించేందుకు రెడీ అవుతున్నట్లుగా ఉంది. పోలింగ్ లాగా కౌంటింగ్ కాదు. కౌంటింగ్ గురించి సందేహాలే ఉండకూడదు. కానీ సజ్జల ప్రతీ రోజూ మీడియా ముందుకు వచ్చి కౌంటింగ్ గురించి మాట్లాడుతూంటే.. వైసీపీ ఏదో ప్లాన్ లో ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుట్ర సిద్ధాంత నిపుణుడు అయిన సజ్జల తాము ఏం చేయాలనుకుంటున్నామో.. ముందుగా విపక్షం అలా చేసే ప్లాన్ లో ఉందని ఆరోపించి.. చేయాలనుకున్నది చేపిస్తారు. అందుకే.. ఈసీ సజ్జలపై నిఘా పెట్టాలన్న డిమాండ్లు టీడీపీ నుంచి వినిపిస్తున్నాయి.