ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అన్ని ఆధారాలు ఉన్నా, కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బీఎస్పీ అద్యక్షుడిగా ప్రశ్నించిన ఆయనే ఇప్పుడు ఆమె అరెస్ట్ అక్రమమంటూ మాట్లాడటం ట్రోల్ అవుతోంది.
నాడు కవితను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన ఆర్ఎస్పీ ఇప్పుడెందుకు ఆమె అరెస్ట్ అనైతికం, అక్రమమని వాదిస్తున్నారు..? అని ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. అంటే అప్పుడు లిక్కర్ స్కామ్ కు సంబంధించి కేసును స్టడీ చేయకుండానే కవితను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారా..? లేదంటే రాజకీయ అవసరాల కోసమే ఈ స్టేట్మెంట్ ఇచ్చారా..? అని ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఓ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆర్ఎస్పీ ఇలా పూటకో మాట మాట్లాడటం ఆయనను అభిమానించే బీఆర్ఎస్ వ్యతిరేకులు సైతం తప్పుబడుతున్నారు. రాజకీయాల్లో ఆదర్శవంతంగా నిలుస్తారని ఆశించిన ఆర్ఎస్పీ లిక్కర్ స్కామ్ విషయంలో కవిత ప్రమేయంపై మాట మార్చడం ఆయన క్రెడిబులిటీని దెబ్బతీస్తుందన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు ఆర్ఎస్పీ చంద్రముఖి కన్నా ఘోరంగా మారారని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు.