రామ్ చరణ్ – శంకర్ల సినిమా ‘గేమ్ ఛేంజర్’ అంతులేని టీవీ సీరియల్ లా సాగుతూనే ఉంది. ఈ సినిమాకి శంకర్ ఎప్పుడు గుమ్మడికాయ కొడతాడో తెలియని పరిస్థితి. దాంతో పోస్టర్ పై రిలీజ్ డేట్ ఏం వేయాలో దిల్ రాజుకీ అర్థం కావడం లేదు. దిల్ రాజు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ‘గేమ్ ఛేంజర్’ గురించి అడుగుతూనే ఉంది పాత్రికేయ లోకం. దీనికి దిల్ రాజు దగ్గర కూడా సమాధానం లేదు.
ప్రతీ సీన్‌ని చెక్కుతూ పోవడం శంకర్ స్టైల్. ఈ సినిమాకూ అదే జరుగుతోంది. అందుకే సినిమా ఆలస్యం అవుతోంది. దానికి తోడు ప్యాడింగ్ చాలా పెద్దది. ప్రతీ సీన్లోనూ కనీసం 20 మంది ఆర్టిస్టులు ఉంటున్నార్ట. వాళ్లందరి డేట్లు ఒకేసారి సర్దుబాటు అవ్వడం చాలా కష్టంగా మారుతోంది. వీళ్లందరూ దొరికినా, కీలకమైన తరుణంలో చరణ్ అందుబాటులో ఉండడం లేదట. దాంతో షూటింగ్ నత్తనడక నడుస్తోంది. దాంతో శంకర్ తెలివిగా చరణ్ డూప్‌ని రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. కొన్ని సజీషన్ షాట్స్, లాంగ్ షాట్స్ డూప్ తో మేనేజ్ చేసేస్తున్నార్ట. అలా కొంతమేర అయినా షూటింగ్ జరుగుతుందని శంకర్ ఆలోచన. కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అంజలి, నవీన్ చంద్ర, ఎస్.జె.సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.