” ఈ రోజు తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు” అని గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి కేటీఆర్ చేసిన ట్వీట్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతోంది. కేటీఆర్ పదేళ్ల పాటు అధికారం అనుభవించి… అది కోల్పోయి ఐదు నెలలు మాత్రమే అవుతోంది. అంత లోనే ఇంత రియలైజేషన్.. ప్రజాస్వామ్యస్ఫూర్తి… భారీ డైలాగులు ఎలా సాధ్యమని ఎవరికి వారు అబ్బుర పడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య గొంతుకల గురించి ఎందుగు గుర్తు రాలేదన్నది అందరూ అడిగే ప్రశ్న.
బీఆర్ఎస్ కు ప్రజలు రెండు సార్లు అధికారం ఇచ్చారు. అలాగే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలని వారికీ బలమైన సీట్లను ఇచ్చారు ప్రజలు. అది ప్రజాస్వామ్య గొంతుక. కానీ ఆ గొంతుక నొక్కేసేందుకు ఎవర్నీ వదిలి పెట్టలేదు. అయితే ఆశ పెట్టారు..లేకపోతే బెదిరించారు.. ట్యాపింగులు చేశారు.. చేయగలిగినవన్నీ చేసి అందర్నీ పార్టీలో చేర్చుకున్నారు. ఆ గొంతుకల్ని నొక్కేశారు.
మనకు ఎమ్మెల్యేల అవసరం లేదుగా ఎందుకు చేర్చుకోవడం అని పల్లా రాజేశ్వర్ రెడ్డి అడిగితే.. వారు ఆ పార్టీలో ఉంటే కుక్కల్లా మొరుగుతూ ఉంటారు.. మన పార్టీలో చేర్చుకుంటే మూసుకుని ఉంటారని… కేసీఆర్ చెప్పారట. ఈ విషయాన్ని పల్లానే బహిరంగంగా ప్రజలకు చెప్పారు. అలా అడ్డోగులుగా ప్రజా గొంతుకల్ని నొక్కేసినప్పుడు… తెలంగాణకు ఏం కావాలో గుర్తుకు రాలేదు. కానీ ఇప్పుడు.. తమకు సీట్లు అవసరమయ్యే సరికి.. తెలంగాణ గొంతుక అని.. ప్రజల ముందుకు వస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పదేళ్ల పాలనలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారిని ఎవర్నీ వదిలి పెట్టలేదు. ఆ బాధలు పడిన వారికే తెలుసు. ఇప్పుడు వారంతా కేటీఆర్ చెప్పే మాటలు … చెబుతున్న మాటలు విని.. బిగ్గరగా నవ్వుకునే పరిస్థితి వచ్చింది.