మీరు ఏది చేస్తే మీకు అది తిరిగి వస్తుందని గీత చెబుతోంది. చాలా మంది అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయి.. తర్వాత అలాంటివే తమకు జరుగుతూంటే.. గగ్గోలు పెడుతూంటారు.కానీ ఎవరి సానుభూతి రాదు. చరిత్రలో ఇలాంటివి ఎన్నో జరిగాయి. అయినా అధికారం నెత్తికెక్కించుకున్న వారు మాత్రం మారడంలేదు.. రాజకీయ నేతలే కాదు.. వారి ప్రాపకం కోసం వెంపర్లాడుతున్న ఐఏఎస్, ఐపీఎస్లకూ అదే పరిస్థితి.
రాజకీయ నాయకులు ఐదేళ్లకోసారి మారతారు. సివిల్ సర్వీస్ అధికారులు పూర్తిగా రిటైరయ్యే వరకూ ప్రభుత్వంలో ఉంటారు. ఇది వారికి తెలియనిది కాదు. కానీ పోస్టింగుల కోసం ఇతర అక్రమాల కోసం.. ప్రభుత్వ పెద్దల అనుగ్రహం కోసం సొంత అధికారులపై కూడా కుట్రలు చేసే దౌర్భాగ్య స్థితికి చేరుకున్నారు. జగన్ సీఎం అయ్యాక.. అనేక మంది అధికారులపై కుట్రలు చేసి తప్పుడు కేసులు పెట్టారు. ఇందు కోసం సవాంగ్ అనే డీజీపీ హోదాలో ఉన్న అధికారి ఫోర్జరీ కూడా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయంలో ఒక్క ఏబీవీ మాత్రమే బయటకు కనిపిస్తున్నారు. ఆయన ఐదేళ్ల సర్వీస్ ను తప్పుడు పద్దతిలో సస్పెన్షన్ పేరు చెప్పి నాశనం చేశారని క్యాట్ చెప్పింది. సుప్రీంకోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. అయినా పోస్టింగ్ ఇవ్వలేదు. క్యాట్ లో అప్పీల్ చేసి.. ఆయన రిటైరయ్యే వరకూ పోస్టింగ్ ఇవ్వకుండా ఉండాలని అుకుంటోంది. ఇదంతా సీఎస్ కనుసన్నల్లోనే జరుగుతోంది. ప్రభుత్వం మారితే.. అంత కంటే ఘోరమైన పరిస్థితి ఆయనకు వస్తుందన్న అంచనాకు రాలేకపోతున్నారు.
ఒక్క సీఎస్ కాదు.. ఎంతో మంది అధికారులు కోర్టు ధిక్కరణ శిక్షలకు గురయ్యారు.. ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఉన్నారు. వారంతా ప్రభుత్వం మారితే తప్పించుకోగలరా ?. కుట్రలు చేసి సొంత అధికారుల్ని వేధించారు.. వారు ఊరుకుంటారా ?. ఇలా రాజకీయ పార్టీల ట్రాప్ లో పడిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ నెత్తి మీద తాము చేయి పెట్టుకున్నట్లుగా అవుతోంది. ఇది ఇప్పటితో ఆగేది కాదు.