నూనూగు మీసాల వయసులోనే ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన హీరో… రెండు దశాబ్దాల తర్వాత కూడా అగ్రపధంలో కొనసాగడం అంటే అదొక సమ్‌థింగ్ స్పెషల్ ప్రయాణంలానే చూడాలి. ఇలాంటి అద్భుత నట జీవితం జూనియర్ ఎన్టీఆర్ సొంతం. అయితే ఇదేదో ఆషామాషీగా సాధ్యపడలేదు. ప్రతిభ, నిరంతర శ్రమ, పట్టుదలతో పాటు ఆయనలోని విశేషమైన లక్షణాలు ఆయన్ని ప్రత్యేకంగా నిలిపాయి.
తాత నుంచి రూపమే కాదు మాటని కూడా పుణికిపుచ్చుకున్నారు తారక్. ఎన్టీఆర్ తర్వాత అంత అద్భుతమైన వాగ్ధాటితో సంభాషణల్ని పడించగల నేర్పు తారక్ కి వుంది. ఆయన్ని అభిమానుల్లో నిలబెట్టిందే డైలాగ్ డెలివరీ. మాటని, పదాలని ఎంత నొక్కి చెప్పాలి, ఎక్కడ తేలికగా వుండాలి, ఎక్కడ బరువు పెంచాలనే సెన్స్ ని పట్టుకున్న నటుడు తారక్. బ్రీత్ లెస్ డైలాగులని అలవోకగా చెప్పే నేర్పు తారక్ సొంతం.
ఏక సంతా గ్రహి అనే మాట ఎన్టీఆర్ కి సరిగ్గా నప్పుతుంది. డైలాగ్ పేపర్ ఒక్కసారి చూస్తే చాలు.. సీన్ పూర్తయ్యే వరకూ మళ్ళీ గుర్తు చేసుకునే అవసరం లేని జ్ఞాపకశక్తి కలిగిన ఆర్టిస్ట్ తను. డ్యాన్స్ విషయంలో కూడా ఇంతే. గురుముఖంగా కూచిపూడి నేర్చుకున్నారు. ప్రదర్శనలు ఇచ్చారు. అది తన డ్యాన్స్ కు బలమైన పునాది వేసింది. ఎన్టీఆర్ డ్యాన్సులో ఒక స్పెషాలిటీ వుంది. ఏదైనా మూమెంట్ ని కొరియోగ్రఫర్ ఒకసారి చూపిస్తే చాలు.. రిహార్సల్ అవసరం లేకుండా సింగిల్ టేక్ లో ఫినిష్ చేసేస్తారు. ఇది మామూలు విషయం కాదు. ఒక కమర్షియల్ హీరోకి ఇలాంటి నైపుణ్యం వుండటం ఒక వరమనే చెప్పాలి.
ప్రతి నటుడికి కొన్ని పరిమితులు వుంటాయి. యాక్షన్ బాగా చేసిన కొందరు నటులు ఎమోషన్స్ పండించడంలో ఇబ్బంది వుంటుంది. ఎమోషన్స్ బావుంటే కామెడీ టైమింగ్ అంతగా పట్టదు. ఎన్టీఆర్ కి ఇలాంటి సమస్యలు లేవు. నవరసాలు అలోవొకగా పండిచగలడు. జానపదం, పౌరాణికం, హిస్టారికల్, ఫాంటసీ ఇలా ఏ జోనర్ పాత్రలోనైన ఇమిడిపోయే కొద్దిమంది అరుదైన నటుల్లో తారక్ ముందువరుసలో వుంటారు.
జయాపజయాలని బ్యాలెన్స్ చేసుకుంటూ పరిశ్రమలో అడుగులు వేయడం అంత తేలికైన వ్యవహారం కాదు. ముఖ్యంగా కెరీర్ బిగినింగ్ లోనే పెద్ద హిట్ కొట్టిన చాలా మంది హీరోలు.. ఆ విజయాన్ని కొనసాగించి కెరీర్ ని మలచుకోవడంలో తడబడిన సందర్భాలు చాలానే కనిపిస్తాయి. ఎన్టీఆర్ కు కెరీర్ బిగినింగ్ లోనే ఆది, సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్లు పడ్డాయి. తర్వాత ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు.. ఇలా వరుసగా అపజయాలు చుట్టూముట్టాయి. కానీ ఎన్టీఆర్ ఎక్కడా తొణకలేదు. ఇండస్ట్రీ హిట్లు పడినప్పుడు ఎలాగైతే ఎలాంటి హైప్ లేకుండా వున్నారో.. అపజయాలు వచ్చినప్పుడు కూడా అంతే నిబ్బరంగా వున్నారు. ఈ లక్షణమే ఆయన్ని అగ్రపధం వైపు నడిపింది.
ఏ రంగంలోనైన కమ్యునికేషన్ చాలా ముఖ్యం. ఈ విషయంలో తారక్ కి ఫుల్ మార్కులు పడిపోతాయి. బహిరంగ వేదికల్లో కాని, మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కానీ తారక్ మాటల్లో చాలా స్పష్టత వుంటుంది. చెప్పే విషయంలో లాగ్ వుండదు. మాట రోల్ అవ్వదు. సూటిగా స్తుత్తి లేకుండా ఒక విషయాన్ని ఎంత వరకూ చెప్పాలో క్లారిటీ వుంటుంది. తారక్ మాట్లాడితే ఎడిట్ చేయాల్సిన అవసరం ఉండదని, ఎంత కావాలో అంతే తూకం చూసినట్లుగా మాట్లాడుతారని మీడియా సర్కిల్స్ లో చెప్పుకొంటుంటారు. స్పాంటెనిటీలో తారక్‌కు తిరుగులేదు. ఈ లక్షణంతోనే ‘బిగ్ బాస్’ హోస్ట్ అవతారం ఎత్తాడు. అక్కడా… తనదైన మార్క్ చూపించాడు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఒక సీజన్‌ని దిగ్విజయంగా నడిపించాడు.
స్టార్ డమ్ వచ్చాక క్యాంపులు తయారౌతుంటాయి. ఒక క్యాంపులో వున్న హీరో మరో క్యాంప్ హీరోలతో అంటీముట్టనట్టుగా వుంటారు. ఇలాంటి క్యాంపు స్నేహాలకు ఎన్టీఆర్ దూరం. తనకు ఇండస్ట్రీలో అందరి హీరోలతో మంచి స్నేహం వుంది. ఇది పరిశ్రమలో తారక్ ని అందరివాడిగా చేసింది.
ఎంత స్టార్ డమ్ చూసినప్పటికీ ‘కింద నేల వుంది’అనే నిజాన్ని, తత్వాన్ని జీవితంలో చాలా తొందరగానే అనుభవంలోకి తెచ్చుకున్న నటుడు తారక్. జీవితంలో ఎదురైన పరిస్థితులు తన వ్యక్తిత్వంలో మార్పుని తీసుకొచ్చాయి. ఆయనతో కాసేపు మాట్లాడితే జీవితాన్ని లోతుగా అర్ధం చేసుకున్న వ్యక్తితో మాట్లాడినట్టుగా వుంటుంది.
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ కలని సాధ్యం చేయడంలో భాగస్వామి అయిన తారక్.. ఇప్పుడు ‘దేవర’ తో ప్రేక్షలుల్ని అలరించడానికి రెడీ అవుతున్నారు. తారక్ ప్రయాణం మరింత అద్భుతంగా సాగాలని, మరిన్ని కీర్తి ప్రతిష్టలు సాధించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే.. ఎన్టీఆర్.