కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలను పాయింట్ టూ పాయింట్ గుర్తించే పనిలో పడింది జ్యుడిషియల్ కమిషన్. ఇందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మొదటి నుంచి ఏమేం జరిగిందో స్టడీ చేసి ఆ తర్వాత ఫైనల్ రిపోర్ట్ ను రూపొందించాలని ఫిక్స్ అయింది. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును కాదని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంకు దారితీసిన పరిస్థితుల నుంచి అధ్యయనం మొదలు పెట్టాలని భావిస్తోంది.
బీఆర్ఎస్ సర్కార్ ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టును తెరమీదకు తీసుకొచ్చింది..? ప్రాణహితతో పోలిస్తే కాళేశ్వరం ఆవశ్యకత ఏంటి..? మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందం..? అందుకు అనుగుణంగానే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందా..? ఏమైనా పొరపాట్లు జరిగాయా..? ఈ విషయాలను ముందుగా తేల్చాలని కమిషన్ నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు ఈ ప్రాజెక్టుకు సంబంధించి టెక్నికల్ అంశాల కోసం ఎక్స్ పర్ట్స్ కమిటీ ఏర్పాటు చేయాలనుకుంటుంది జ్యుడిషియల్ కమిషన్. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇంజినీర్లతో కమిషన్ రెండుసార్లు భేటీ అయి చర్చలు జరిపింది. ఏర్పాటు చేయబోయే నిపుణుల కమిటీ ఇచ్చే నివేదికతోపాటు ఇరిగేషన్ శాఖ అధికారుల నివేదికను పరిశీలించి ఈ ప్రాజెక్టులో చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు వస్తోన్న అవకతకలపై కమిషన్ ఓ స్పష్టతకు రావొచ్చునని భావిస్తోంది.
ఇప్పటికే కాళేశ్వరం నిర్మాణంతో సంబంధం ఉన్న అధికారులు, ఇంజినీర్లకు జ్యుడిషియల్ కమిషన్ విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులకు సైతం నోటీసులు ఇచ్చేందుకు కమిషన్ రెడీ అవుతోంది. ఈ ప్రాజెక్టుపై అసెంబ్లీలో వైట్ పేపర్ ను రిలీజ్ చేసి లోపాలపై ప్రభుత్వం వివరించడంతో వాటిని అధ్యయనం చేసి అధికారులను, ఇంజినీర్లను ప్రశ్నించనుంది కమిషన్.