ఏపీలో పోలింగ్ అనంతరం కొన్ని చోట్ల ఉద్దేశపూర్వక దాడులు జరగడం వెనుక వ్యవస్థీకృతమైన కుట్ర ఉన్నదన్న అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి. ఎన్నికల కమిషన్ నిందించడానికి, అధికారుల బదిలీలను తప్పు పట్టడానికి ఈ కుట్రను అమలు చేశారని బలంగా ఆధారాలు లభిస్తున్నాయి. ఈ విషయంలో కొంత మంది అధికారుల్ని బలి చేసినా… ఈసీ కక్షపూరితంగా వ్యవహరించిందని .. కూటమికి అనుకూలంగా పని చేసిందని వాదించడానికి ఈ మొత్తం దాడుల ఎపిసోడ్ ను నడిపినట్లుగా అనుమానిస్తున్నారు.
ఈసీ అధికారుల్ని బదిలీ చేసిన చోట్ల మాత్రమే దాడులు జరిగాయని.. ఇది ఈసీ వైఫల్యమని వైసీపీ నేతలు పదే పదే మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు. ఈసీ అధికారుల్ని మార్చిన చోటే ఎందుకు దాడులు జరిగాయి.. ఈ లాజిక్ ఏమిటన్నది మాత్రం వైసీపీ నేతలు చెప్పడం లేదు. అక్కడే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్ అధికారులు అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి విచారణ జరిపారు. అల్లర్లు అప్పటికప్పుడు జరిగినవి కావని పక్కా ప్రణాళికతో నిర్వహించారన్న ఓ అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈసీపై ఒత్తిడి పెంచడానికి.. నిందలు వేయడానికి .. ఎన్నికల ప్రక్రియను అపసహాస్యం చేయడానికి యంత్రాంగంలోని తమ మనుషుల ద్వారా వైసీపీ పెద్దలు చేయని కుట్రలంటూ లేవన్నట్లుగా ఆరోపణలు క్రమంగా బలపడుతున్నాయి. ఈ విషయంలో సిట్ అధికారులు అసలైన కుట్ర కోణం దగ్గరకు వెళ్తారా లేకపోతే.. ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లోని ఘటనల వరకే పరిమితమవుతారా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. సిట్ చీఫ్ గా ఉన్న వినీత్ బ్రిజ్ లాల్పై వైసీపీ విధేయ ఐపీఎస్ అన్న ముద్ర అంతగా లేదు. అయితే ఆయనను స్వచ్చగా పనిచేయనిస్తారా… నిజాయితీగా ఈసీకి నిజాల్ని చెప్పనివ్వనిస్తారా అన్న సందేహాలు మాత్రం ఉన్నాయి.
అల్లర్లపై సిట్ అసలు కుట్రకోణాన్ని వెలికి తీస్తే… సంచలన అంశాలు బ యటపడే అవకాశం ఉంది. తమపై జరిగిన కుట్రను ఈసీ బయట పెట్టుకోగలిగితే రాజకీయాల్లో పెను ప్రకంపనలు వస్తాయి.