ఎన్టీఆర్ తదుపరి సినిమా ఏమిటన్న విషయంపై ఓ స్పష్టత వచ్చింది. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తో మైత్రీ మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. ‘దేవర’ తరవాత ఎన్టీఆర్ నటించే సినిమా ఇదే. ఆగస్టు నుంచి చిత్రీకరణ మొదలు కాబోతోందని మైత్రీ మూవీస్ సంస్థ ప్రకటించింది. ఈరోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అఫీషియల్‌గా ఈ ప్రకటన జారీ చేసింది మైత్రీ మూవీస్. ఈ చిత్రం కోసం ‘డ్రాగన్’ అనే పేరు పరిశీలిస్తున్నారు.
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం `సలార్ 2`ని ఫినిష్ చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆగస్టులోగా ‘దేవర’ వర్క్ కూడా పూర్తవుతుంది. ఆ వెంటనే ‘డ్రాగన్’కు క్లాప్ కొడతారు. అయితే ‘దేవర 2’ సినిమాని సైతం ఎన్టీఆర్ సమాంతరంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకు.. ఎన్టీఆర్ `దేవర` గెటప్‌లోనే ఉండాల్సిన అవసరం ఉంది. మరి ప్రశాంత్ నీల్ సినిమాకు గెటప్ ఛేంజ్ చేయాల్సివస్తే పరిస్థితి ఏమిటన్నది పెద్ద ప్రశ్న. ‘డ్రాగన్’కు సంబంధించిన సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయ్యిందని టాక్. ‘కేజీఎఫ్’, ‘సలార్’, ‘దేవర’లా.. ‘డ్రాగన్’ కూడా రెండు భాగాలుగా వచ్చే అవకాశాలున్నాయన్న టాక్ కూడా గట్టిగానే వినిపిస్తోంది. దీనిపై మైత్రీ మూవీస్ ఎప్పుడు స్పందిస్తుందో?