ఈసారి ఏపీ ఎన్నికలు మెగా ఫ్యామిలీ హీరోలు, అభిమానుల మధ్య చిచ్చు పెట్టాయి. అల్లు అర్జున్ వైకాపా అభ్యర్థికి సపోర్ట్ చేయడమే అందుకు కారణం. కుటుంబంలో ఓ హీరో, ఓ పార్టీ పెట్టి జనం కోసం పోరాడుతున్నప్పుడు, ట్విట్టర్లో అభినందనలు తెలిపి, ప్రత్యర్థి కోసం మాత్రం నేరుగా ఆ నియోజకవర్గమే వెళ్లడం పెద్ద దుమారమే రేపింది. దీనిపై బన్నీ వివరణ ఇచ్చుకొన్నా, పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం చల్లారలేదు. ఈ ఎఫెక్ట్ ‘ఆహా’పై పడుతోంది. ‘ఆహా’ సబ్స్క్రిప్షన్లు రద్దు చేసుకోమని పవన్ అభిమానులు ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ చాలామంది ఇప్పుడు ‘ఆహా’ సభ్యత్వాన్ని రద్దు చేసుకొంటున్నారు. అసలే ‘ఆహా’ కష్టాల్లో ఉంది. యాజమాన్యం చేతులు మారబోతోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ ఈ టైపులో పగ తీర్చుకోవడం మరింత నష్టాన్ని కలిగించబోతోంది.
ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే షో రన్ చేస్తే, అందుకోసం పవన్ సైతం వచ్చాడు. సినిమా ఇంటర్వ్యూలకూ, ఇలాంటి టాక్ షోలకూ దూరంగా ఉండే పవన్, కేవలం అల్లు అరవింద్ మాటపై గౌరవంతో ఈ షోలో పాల్గొన్నాడు. ఆ రోజున… ‘ఆహా’ సభ్యత్వాలు బాగా ఊపందుకొన్నాయి కూడా. బన్నీ ఆ సంగతి కూడా మర్చిపోయాడన్నది పవన్ అభిమానుల కంప్లైంట్. పవన్‌కు ఎలాగైతే ట్విట్టర్లో తన అభినందనలు తెలిపాడో, అలానే తన స్నేహితుడికీ సోషల్ మీడియా ద్వారానే సపోర్ట్ చేయడం చాలామందికి నచ్చలేదు. చేస్తే ఇద్దరికీ ఒకేలా చేయాల్సింది, లేదంటే మాట్లాడకుండా కూర్చోవాల్సింది. అప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు.