ఏపీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఈసీకి ఇంటలిజెన్స్ నివేదిక ఇచ్చింది. కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగే ఛాన్స్ ఉందంటూ అలర్ట్ చేసింది. కౌంటింగ్ కు ముందు, తర్వాత దాడులు జరిగే ప్రమాదం ఉందని ఎన్నికల కమిషన్ కు నిఘా వర్గాలు రిపోర్ట్ ఇచ్చాయి.
నిఘా వర్గాల హెచ్చరికలతో కాకినాడలోని ఎటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేటపై ఈసీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో గొడవలు చేసిన, ప్రేరేపించిన వ్యక్తులపై నిఘా ఉంచాలని పోలీసులను ఆదేశించింది. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేయాలని పేర్కొంది. ఈసీ ఆదేశాలతో పోలీసులు ఆయా నియోజకవర్గాల్లో ఎవరెవరికి నేరచరిత్ర ఉంది..?అనేది ముందుగానే గుర్తించి వారిపై ఫోకస్ పెట్టనున్నారు.
హింసాత్మక ఘటనల హెచ్చరికల నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ఉండేలా పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. అనుమానితులను ముందుగానే గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. కౌంటింగ్ కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ పరిసర ప్రాంతాల్లో కేంద్ర బలగాలను పెద్దఎత్తున మొహరించనున్నారు.
పోలింగ్ రోజున జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్ రోజున ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల పొలిసు ఉన్నతాధికారులకు సీరియస్ ఆదేశాలు ఇచ్చింది ఈసీ.