కేరళ, తమిళనాడు శాసనసభలకు మే16న ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం ఆరు నెలల క్రితం నుంచే ఆ రెండు రాష్ట్రాలలో రాజకీయపార్టీల హడావుడి మొదలయిపోయింది. ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న జయలలితకు చెందిన అన్నాడిఎంకె పార్టీతో పొత్తులు పెట్టుకొని ఈసారి ఆ రాష్ట్రానికి కూడా తమ పార్టీని విస్తరించాలని బీజేపీ కలలుకంది. ఆమెను ప్రసన్నం చేసుకోవడం కోసం మోడీ ప్రభుత్వం చాలా ప్రయత్నించింది కానీ ఇంతవరకు ఆమె సానుకూలంగా స్పందించలేదు. ఈ ఎన్నికలలో కూడా ఆమె పార్టీకే విజయావకాశాలు కనిపిస్తుండటంతో, బీజేపీతో పొత్తులకు ఆమె ఆసక్తి చూపడం లేదు.
తమిళనాడుకి చెందని పార్టీ అది ఎంత గొప్పదయినా ఏదో ఒక ప్రాంతీయపార్టీతో పొత్తులు, దాని మద్దతు లేకపోతే ఆ రాష్ట్ర ప్రజల కంటికి అసలు ఆనదు. తమిళనాడుని ఇదివరకు చాలాసార్లు పాలించిన, రాష్ట్రంలో చాలా బలమయిన ప్రతిపక్ష పార్టీ డి.ఎం.కె. అధినేత కరుణానిధి భాజపాతో పొత్తులు పెట్టుకొనేందుకు ఆసక్తి చూపారు. కానీ అప్పుడు భాజపా ఆసక్తి చూపలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడిఎంకె పార్టీతోనే పొత్తులు పెట్టుకోవడానికే ఆసక్తి చూపించింది. భాజపా ఆసక్తి చూపించకపోవడంతో డి.ఎం.కె.తో కాంగ్రెస్ పార్టీ చేతులు కలిపింది. కనుక ఇప్పుడు భాజపాకి డి.ఎం.కె. తలుపులు కూడా మూసుకుపోయాయి.
ఆ విధంగా రాష్ట్రంలో బలమయిన అధికార, ప్రతిపక్షాల తలుపులు మూసుకుపోవడంతో ఇప్పుడు వాటికి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న డి.ఎం.డి.కె. పార్టీతో చేతులు కలిపేందుకు భాజపా సిద్దమయింది. తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ఇన్-చార్జ్ గా వ్యవహరిస్తున్న కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ చెన్నైకి వెళ్లి డి.ఎం.డి.కె. అధినేత కెప్టెన్ విజయకాంత్ తో పొత్తుల కోసం చర్చలు జరుపుతున్నారు. తమతో చేతులు కలిపేందుకు అంగీకరిస్తే ఆయననే తమ కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్దామని ప్రతిపాదించారు. ఆయన కూడా చాలా కాలంగా ముఖ్యమంత్రి అవ్వాలనే కలలుగంటున్నారు కనుక భాజపా ప్రతిపాదనకు అంగీకరించి దానితో పొత్తులు పెట్టుకోవడానికి సిద్దపడవచ్చును.
ఆ ప్రతిపాదన పట్ల రాష్ట్ర భాజపా నేతలు చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికలలో భాజపా గౌరవప్రదమయిన స్థానాలు సంపాదించుకోవాలంటే తప్పనిసరిగా డి.ఎం.డి.కె. పార్టీతో పొత్తులుపెట్టుకోవలసిందే కనుక రాష్ట్ర నేతలు అసంతృప్తిగా ఉన్నా భాజపా అధిష్టానం పట్టించుకోకపోవచ్చును. అయినా రాష్ట్రంలో మళ్ళీ అన్నాడిఎంకె పార్టీయే అధికారంలోకి వచ్చే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నప్పుడు కెప్టెన్ విజయ్ కాంత్ ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తే భాజపాకి కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండదు. అది కొండకి వెంట్రుకని ముడేసి లాగే ప్రయత్నమేనని చెప్పవచ్చును. అతని పార్టీతో పొత్తుల వలన భాజపాకి వస్తే కొన్ని సీట్లు వస్తాయి లేకుంటే లేదు. రాష్ట్రంలో అధికార పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని ఆరాటపడిన భాజపా చివరికి చాలా జిత్తులమారి, తిక్కమనిషిగా చెప్పుకోబడే కెప్టెన్ విజయ్ కాంత్ చేతిలో పడబోతుండటం చూసి ‘అయ్యో! పాపం భాజపా…” అని అనుకోకుండా ఉండలేము.