ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేసిన ఐ ప్యాక్ టీమ్ ఏపీ నుంచి ప్యాకప్ చెప్పేసింది. ఉన్నట్టుండి మూడు వందల మంది ఉద్యోగులు వెళ్ళిపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల విజయవాడలోని ఐ ప్యాక్ కార్యాలయానికి జగన్ వెళ్లి ఇకమీదటా వైసీపీకి ఐ ప్యాక్ సేవలు కొనసాగుతాయని ప్రకటించినా ఆ సంస్థ ఉద్యోగులు వెళ్ళిపోవడం హాట్ టాపిక్ అవుతోంది.
నిజానికి జగన్ ఐప్యాక్ ఆఫీసుకు వెళ్తారని ఊహించలేదు. కానీ, వైసీపీకి వ్యూహాకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ లో ఉండి మరీ తనపై వ్యతిరేక ఇంటర్వ్యూలు ఇవ్వటం, వైసీపీ ఓడిపోతుందని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దీనికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే జగన్ ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లి… ఐప్యాక్ వేరు పీకే వేరు అని మెసేజ్ పంపారు.
మొన్నటి వరకు వై నాట్ 175అని వైసీపీ ప్రచారం చేసినా… ఇప్పుడు గెలిచే పరిస్థితి లేదు. ఆ విషయం ఐప్యాక్ ఉద్యోగులకూ తెలుసు. అందుకే ఎవరి దారి వారు చూసుకుంటుండగా, మిగిలిన వారిని జగన్ కంటిన్యూ చేస్తారా అన్న అనుమానాలున్నాయి.
ఐప్యాక్ ఉండగానే సజ్జల కొడుకు భార్గవ్ ను ముందుపెట్టి కొత్త దుకాణం తెరిచారు. ఐప్యాక్ కు సమాంతరంగా సజ్జల నడిపే సంస్థ కూడా పనిచేసింది. భవిష్యత్ లో ఐప్యాక్ ను పక్కనపెట్టేందుకే మరో సోషల్ మీడియా అన్నది వైసీపీలో ఓపెన్ సీక్రెట్. ఆ విషయం ఐప్యాక్ సంస్థకు కూడా తెలుసు.
అందుకే గెలిచినా, ఓడినా ఐప్యాక్ ను కంటిన్యూ చేస్తారు అన్న భరోసా లేకపోవటం… గెలుస్తామన్న ఆశ కూడా లేకపోవటంతో ఐప్యాక్ ప్యాకప్ అన్న ప్రచారం ఏపీలో జోరుగా సాగుతోంది.