వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా చేసినట్లుగా ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీ విధానాలు నచ్చకే పార్టీని వీడుతున్నట్లుగా లేఖలో పేర్కొన్నారు. ఆయన పేరుతోనే ఈ లేఖ బయటకు రావడంతో నిజంగానే బొత్స వైసీపీకి రాజీనామా చేశారా..? లేక మరెవరైనా ఫేక్ లెటర్ ను క్రియేట్ చేశారా..? అన్నది సస్పెన్స్ గా మారింది.
విజయనగరం జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న బొత్సకు జగన్ రెడ్డి వైసీపీ కేబినెట్ లో ప్రాధాన్యత కల్పించారు. ఈ ఎన్నికల్లో ఆయన కుటుంబం నుంచి నలుగురికి టికెట్లు ఇచ్చారు. చీపురుపల్లి నుంచి బొత్స పోటీ చేస్తుండగా, విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి సతీమణి ఝాన్సీ లక్ష్మి, గజపతినగరం నుంచి తమ్ముడు అప్పల నరసయ్య, నెల్లిమర్ల నుంచి సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడులకు జగన్ టికెట్ ఇచ్చారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఇటీవల బొత్స మీడియాతో మాట్లాడుతూ జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారని, ఇందుకు విశాఖ వేదికగా మారుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు చేసి వారం రోజులు కూడా కాలేదు అప్పుడే ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా లేఖ బయటకు రావడం కలకలం రేపుతోంది. బొత్స పేరుతో విడుదలైన ఈ లేఖలో తేదీని ప్రస్తావించకపోవడంతో ఇది నకిలీదని స్పష్టం అవుతోంది. కాగా, ఈ లేఖను ఎవరు క్రియేట్ చేశారన్నది ఇప్పుడు కీలకంగా మారింది.