దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న సినీ, రాజకీయ ప్రముఖులను తప్పించే ప్రయత్నం జరుగుతుందా..? ఈ విషయంలో మొదట దూకుడుగానే స్పందించిన బెంగళూరు పోలీసులు ఆ తర్వాత సైలెంట్ కావడానికి రాజకీయ ఒత్తిడే కారణమా..? అసలు ఈ కేసులో ఏం జరుగుతోంది..?
సినీ, రాజకీయ వర్గాల్లో ఇప్పుడిదే బిగ్ డిబేట్. బెంగళూరులో రేవ్ పార్టీ జరుగుతుందని సమాచారం మేరకు సోమవారం తెల్లవారుజామున ౩ గంటలకు గోపాల్ రెడ్డి ఫామ్ హౌజ్ పై పోలీసులు దాడి చేశారు.అక్కడ ఎండీఎంఏ డ్రగ్స్ తోపాటు గంజాయి చరస్ స్వాధీనం చేసుకున్నారు. ఈ రేవ్ పార్టీలో పలువురు తెలుగు, తమిళ, కన్నడకు చెందిన సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా పాల్గొన్నారు. టాలీవుడ్ నటి హేమ తాను హైదరాబాద్ లో ఉన్నట్లు వీడియో విడుదల చేసిన కొద్దిసేపటికే పోలీసులు ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు ఆధారాలు కూడా బయట పెట్టారు. దీంతో ఈ కేసును బెంగళూరు పోలీసులు సీరియస్ గా తీసుకున్నారని , ఎవరిని వదలబోరని సంకేతాలు ఇచ్చినట్లుగా కనిపించింది.
కట్ చేస్తే రిమాండ్ రిపోర్ట్ లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లను చేర్చకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు పోలీసులు ఎందుకు కొంతమంది ప్రముఖుల పేర్లను తప్పించారు..? రాజకీయ ఒత్తిడే అందుకు కారణమా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు, రిమాండ్ రిపోర్ట్ లో ప్రముఖుల పేర్లు మిస్సింగ్ కావడం పట్ల ప్రతిసారి ఇదే కదా జరిగేది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.