ఐపీఎల్ సీజన్ నడుస్తున్న ప్రతీసారి ధోనీ రిటైర్మెంట్ గురించిన ప్రస్తావన రాక మానదు. ‘ఈసారి ధోనీ రిటైర్ అవుతాడా’ అనే ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. ఆ ప్రశ్నకు ధోనీ చిరునవ్వుతో సమాధానం చెప్పి తప్పించుకొంటాడు. మరో ఐపీఎల్ లో ధోనీ ప్యాడ్లు, కీపింగ్ గ్లౌజులు కట్టుకొని మళ్లీ బరిలోకి దిగిపోతుంటాడు. కొన్ని సీజన్లుగా ఇదే తంతు నడుస్తోంది. అయితే ఈసారి మాత్రం ఈ సీన్ మారింది. ధోనీ ఇక ఐపీఎల్ లో కనిపించకపోవొచ్చు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్… ధోనీ కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ అన్న సంకేతాలు వ్యక్తం అవుతున్నాయి.
ధోనీ వయసు 42 ఏళ్లు. వచ్చే యేడాదికి 43 వస్తాయి. అప్పటికీ ఫిట్ గా ఉండాలనుకోవడం అత్యాసే. ఇప్పటికే ధోనీ పలు సమస్యలతో బాధ పడుతున్నాడు. తొడ కండరాలు పట్టేయడంతో.. వికెట్ల మధ్య పరుగెత్తలేకపోతున్నాడు. ఈ ఐపీఎల్ లో ధోనీ ఎప్పుడూ చివరి ఓవర్లో బ్యాటింగ్ చేయడానికే ఇష్టపడ్డాడు. తనకంటే ముందు జడేజాలాంటి వాళ్లు వచ్చి బ్యాటింగ్ చేశారు. ధోనీ మాత్రం చివరి వరుసలో వచ్చాడు. బెంగళూరుతో మ్యాచ్ ముగిశాక ధోనీ మీడియా ముందుకు రాలేదు. దాంతో రిటైర్మెంట్ ప్రశ్న అలానే ఉండిపోయింది. ఈ ప్రశ్నకు అతను మాత్రమే సమాధానం చెప్పగలడు. మరోవైపు ధోనీ తొడ కండర గాయంతో బాధ పడుతున్నాడు. ఆ నొప్పిని దిగమింగుకుంటూనే కీపింగ్ చేశాడు. త్వరలోనే లండన్ లో ధోనీకి శస్త్ర చికిత్స జరగబోతోందని తెలుస్తోంది. ఆ తరవాతే.. ధోనీ ఆటని కొనసాగిస్తాడా, లేదా? అనేది తేలుతుంది. అయితే క్రీడా వర్గాలు మాత్రం ఆ అవకాశం లేదంటున్నాయి. సాధారణంగా చివరి మ్యాచ్ ఆడుతున్నప్పుడు అభిమానులతో సెలబ్రేట్ చేసుకోవాలని ప్రతి ఆటగాడూ అనుకొంటాడు. ఓరకంగా అదో ఎమోషనల్ మూమెంట్ కూడా. అయితే.. ధోనీ తన చివరి మ్యాచ్‌ని సెలబ్రేట్ చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. వన్డే, టెస్ట్, ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్‌కు గుడ్ చెప్పినప్పుడు సైలెంట్‌గానే ఆ ప్రకటనలు విడుదల చేశాడు. ఇప్పుడు ఐపీఎల్ విషయంలోనూ అదే జరుగబోతోందని టాక్. ఈ ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే ధోనీ రిటైర్మెంట్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.