నేటి నుంచి తెలంగాణా రాష్ట్ర శాసనసభ శాసన మండలి సమావేశాలు మొదలుకాబోతున్నాయి. ఉదయం 11గంటలకు ఉభయసభలను ఉద్దేశ్యించి గవర్నర్ ప్రసంగంతో శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. అనంతరం ఉభయసభల బిజినెస్ అడ్వైజరీ కమిటీలు సమావేశమయ్యి షెడ్యూల్ మరియు సమావేశాలలో చర్చించాల్సిన అజెండాను ఖరారు చేస్తాయి. ఈనెలాఖరు వరకు శాసనసభ సమావేశాలు జరపాలని తెలంగాణా ప్రభుత్వం భావిస్తోంది. మార్చి13 వరకు గవర్నర్ ప్రసంగంపై చర్చ జరిపి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఉంటుంది. మార్చి 14న తెలంగాణా రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ 2016-17సం.ల రాష్ట్ర బడ్జెట్ ని శాసనసభలో ప్రవేశపెడతారు.
వరుసగా వస్తున్న ఎన్నికలలో తెరాస వరుస విజయాలు సాధిస్తుండటం, ఆ విజయాల కోసం ప్రతిపక్ష పార్టీలని పూర్తిగా నిర్వీర్యం చేయడంవలన ఈసారి శాసనసభ సమావేశాలలో తెరాస ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రశ్నించేవారే ఉండరు. ఆ బాధ్యతను ఎప్పుడూ భుజానికెత్తుకొనే రేవంత్ రెడ్డిపై ఏదో ఒక సాకుతో సస్పెన్షన్ వేటు వేసి సభ నుండి బయటకి సాగనంపవచ్చును. ఇప్పటికే తెరాసలో చేరిన తెదేపా ఎమ్మెల్యేలు తమ పార్టీని తెరాసలో విలీనం చేసుకోవాలని అభ్యర్ధిస్తూ ఒక లేఖ ఇచ్చారు. కనుక ఈ సమావేశాలలో తెదేపా నుండి తెరాసను ప్రతిఘటించేవారు ఎవరూ లేనట్లే భావించవచ్చును.
ఇక కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఉన్న కె.జానారెడ్డి మొదటి నుండి కూడా తెరాస పట్ల మెతక వైఖరే అవలంభిస్తున్నారు కనుక ఆ పార్టీ తరపునుండి తెరాస ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేవు. భాజపాలో డా. లక్షణ్ తప్ప మరెవరూ గట్టిగా మాట్లాడేవారు లేరు. కనుక భాజపా నుండి తెరాసకు ఎటువంటి సమస్యలు ఉండకపోవచ్చును.
మహారాష్ట్ర ప్రభుత్వంతో నదీ జలాల పంపకానికి, గోదావరి నదిపై ఐదు బ్యారేజీల నిర్మాణం కోసం ఇటీవల చేసుకొన్న ఒప్పందం గురించి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పుకొని, పనిలోపనిగా గత ప్రభుత్వాలను నిందించడం కూడా తధ్యం. తమ ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పుకొని ఆ కారణంగానే ప్రజలందరూ తెరాసకే ఓట్లు వేస్తునందున తాము వరుస విజయాలు సాధించగలుగుతున్నామని చెప్పుకోవచ్చును. కనుక ఈసారి శాసనసభ సమావేశాలలో తెరాస ప్రభుత్వం చాలా కులాసాగా నడిపించుకోవచ్చును.