ఈ ఐపీఎల్ లో బెంగళూరు కథ సమాప్తమైంది. మరో సీజన్‌ని రిక్త హస్తాలతోనే ముగించింది. బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో పరాజయం పాలైంది. రెండో ఎలిమినేటర్‌లో రాజస్థాన్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. గెలిచిన జట్టు ఫైనల్ లో కొలకొత్తాని ఢీ కొట్టనుంది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. రజిత్ పటేదార్ (34), కోహ్లీ (33), మహిపాల్ (32) ఓ మోస్తరుగా రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 3 వికెట్లు, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. జైస్వాల్ (45), పరాగ్ (36), హిట్మయర్ (26) బ్యాట్ ఝలిపించారు. సిరాజ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి చివర్లో కాస్త ఆశలు చిగురింపజేశాడు. అయితే.. పావెల్ (8 బంతుల్లో 16) బెంగళూరు ఆశలపై నీళ్లు చల్లాడు.
ప్రతీసారీ `ఈసారి కప్ మనదే` అంటూ ఊరించడం, చివర్లో చేతులు ఎత్తేయడం బెంగళూరుకు మామూలే. అయితే ఈ సీజన్లో తొలుత ఘోరంగా తడబడ్డ బెంగళూరు, చివర్లో విజృంభించింది. వరుసగా ఆరు గెలుపులతో ప్లే ఆఫ్‌లో అనూహ్యంగా చోటు దక్కించుకొంది. ప్లే ఆఫ్‌కి చేరడమే ఈ యేడాది బెంగళూరు సాధించిన అతి పెద్ద ఘనతగా మారింది. కోహ్లీ అభిమానులు దాంతో సంతృప్తి పడాల్సిందే.