ఇళయరాజా గొప్ప సంగీత దర్శకుడే! ఆయన శ్రోతలకు, సంగీత ప్రియులకు ఇచ్చిన అద్భుతమైన పాటలు కాస్తా తరతరాల జ్ఞాపకాలుగా మారిపోయాయి. ఇళయరాజాకు సంగీత దర్శకుడిగా నూటికి రెండొందల మార్కులేసే వాళ్లంతా, ఆయన వ్యక్తిత్వ జీవితాన్ని వేలెత్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా ‘కాపీ రైట్స్’ విషయంలో ఇళయరాజా చాలా గట్టిగా వ్యవహరిస్తారు. తన పాట ఎవరైనా పాడినా, వాడినా అస్సలు ఊరుకోరు. దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఆఖరికి ప్రియ మిత్రుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంతోనూ ఈ విషయంలో ఇళయరాజా గొడవకు దిగిన దాఖలాలు ఉన్నాయి.
తాజాగా మరోసారి ఇళయరాజా ఇలాంటి రైట్స్ విషయంలోనే వార్తల్లోకి వచ్చారు. మలయాళంలో సూపర్ హిట్టయిన సినిమా ‘మంజుమల్ బాయ్స్’. తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ చిత్రానికి మంచి వసూళ్లు దక్కాయి. ఈ సినిమా కోసం ‘గుణ’లోని ‘కమ్మని నీ ప్రేమలేఖలే’ అనేపాటని కీలకమైన సందర్భంలో వాడారు. ఆ పాట ఇళయరాజాది. ఇప్పుడు తన అనుమతి లేకుండా ఈ పాట వాడినందుకు గానూ చిత్రబృందంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఇళయరాజా సన్నద్ధం అయ్యారు. ఈ మేరకు దర్శక నిర్మాతలకు నోటీసులు పంపారు. ఈ నోటీసుల వెనుక ఇళయరాజా ముఖ్య ఉద్దేశ్యం.. తనకంటూ కొంత పరిహారం చెల్లించాలనే. నిజానికి ‘మంజుమల్ బోయ్స్’ దర్శక నిర్మాతలు ఈ విషయంలో ముందుగానే ఇళయరాజాని సంప్రదించాల్సింది. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో ఇళయరాజా నిక్కచ్చిగా ఉంటారని అందరికీ తెలుసు. ఆయన అనుమతి లేకుండా పాట వాడుకోవడం నేరమే. ఇళయరాజా ఇప్పుడు ముక్కు పిండి మరీ తనకు కావల్సింది రాబట్టుకోవొచ్చు. కాకపోతే… ఇళయరాజా లాంటి వ్యక్తి, ఇలాంటి విషయాల్లో కోర్టు వరకూ వెళ్లడం, తనకు రావల్సిన క్రెడిట్ గురించి ఆరాటపడడం ఆయన స్థాయికి తగిన విషయాలు కాదు. ఇళయరాజాకు డబ్బు పిచ్చి పట్టుకొందని, చాలామంది బాహాటంగానే విమర్శిస్తుంటారు. ఇలాంటప్పుడే అది నిజమేనేమో అనిపిస్తుంటుంది.