ఒకే సమయంలో మూడు పెద్ద సినిమాలు చిత్రీకరణ దశలో ఉంటే… కచ్చితంగా వాటి మధ్య పోలికలు, హెచ్చు తగ్గుల చర్చ మొదలవుతుంది. ఇప్పుడు ‘పుష్ష 2’, ‘గేమ్ ఛేంజర్’, ‘దేవర’ మధ్య అలాంటి పోటీనే కనిపిస్తోంది. ఇవి మూడూ ఇంచు మించు ఒకే సమయంలో చిత్రీకరణ జరుపుకొంటున్నాయి. అటూ ఇటుగా ప్రమోషన్లు మొదలెట్టాయి. విడుదల తేదీలూ కూడా కాస్త పక్క పక్కనే ఉన్నాయి. అందుకే పోలికలకు ఎక్కువ ఆస్కారం కనిపిస్తోంది.
ఈ మూడు సినిమాల నుంచి ఒకొక్క పాట విడుదలైంది. ముందుగా రామ్ చరణ్ ‘జరగండి.. జరగండి’ పాట వినిపించాడు. తమన్ సంగీత సారధ్యంలో వచ్చిన ఈ పాట అంతగా ఎక్కలేదు. ‘జాబిలమ్మ జాకెట్ వేసుకొని’ అనే మాట మరింత ట్రోల్ అయ్యింది. తమన్ పాటలో నవ్యత లేదని పెదవి విరిచారు. ఆ తరవాత ‘పుష్ష 2’ నుంచి టైటిల్ గీతం వచ్చింది. ఈ పాట బన్నీ ఫ్యాన్స్‌ని ఊపేసింది. సోషల్ మీడియాలో ఈ పాట దుమ్ము రేపుతోంది. యువత ఈ పాట వాడుకొని ఎన్నో వీడియోల్ని వదులుతోంది. బన్నీ స్టెప్పులు కూడా హైలెట్‌గా మారాయి. వచ్చీ రాగానే ఇన్స్టెంట్ గా ఎక్కేసిన గీతమిది.
ఇప్పుడు ‘దేవర’ నుంచి ఫియర్ పాట విడుదల చేశారు. అనిరుథ్‌పై చాలామందికి గట్టి నమ్మకం. ఎలివేషన్ పాటలు అదరగొడతాడని. అయితే ‘ఫియర్’ పాటకు అనుకొన్నంత స్థాయిలో ఎలివేట్ కాలేదు. దానికి తోడు లిరికల్ వీడియోలో అనిరుథ్ డామినేషనే ఎక్కువగా కనిపిస్తోంది. మళ్లీ మళ్లీ వినడానికీ, పాడుకోవడానికీ, సోషల్ మీడియాకు కంటెంట్ గా వాడుకోవడానికి ఈ పాట అంతగా ఉపయోగపడడం లేదు. అనిరుథ్ తమిళ పాటలు బాగానే చేస్తాడు కానీ, తెలుగు వరకూ వచ్చేసరికి ఎందుకో క్లిక్ కాలేకపోతున్నాడు. దానికి తోడు ‘భారతీయుడు 2’ తొలి పాట కూడా అస్సలు వినసొంపుగా లేదు. దాంతో.. ‘దేవర’ తరువాతి పాటలు ఎలా ఉంటాయో అనే బెంగ ఎన్టీఆర్ అభిమానుల్లో కనిపిస్తోంది. కొరటాల శివ – దేవిశ్రీలది మంచి కాంబో. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’.. ఇలా వరుసగా హిట్లు వచ్చాయి. అలాంటప్పుడు దేవిని పక్కన పెట్టి అనిరుథ్ తో ఎందుకు చేయించుకొంటున్నాడో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కూడా అంతు పట్టడం లేదు. ప్రస్తుతానికైతే ఈ మూడు సినిమాల్లో… ‘పుష్ష’దే అప్పర్ హ్యాండ్. ఇక రాబోయే రోజుల్లో ఈ ఆధిపత్యం చేతులు మారుతుందేమో చూడాలి.