మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోపై తీవ్ర దుమారం రేగుతోంది. పోలింగ్ ముగిసిన వారం రోజుల తర్వాత ఈ వీడియో బయటకు రావడంపై వైసీపీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఎవరో కావాలనే పిన్నెల్లిపై కడుపుమంటతో ఫేక్ వీడియోను క్రియేట్ చేశారనే తరహలో సందేహాలు వ్యక్తం చేస్తోంది. తాజాగా ట్విట్టర్ లో సజ్జల కూడా అసలు ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించారు.
పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోను సిట్ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. పోలింగ్ రోజు నుంచి రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడటంతో ఈ అల్లర్లకు కారణం ఏంటో తేల్చాలని ఈసీ సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోలింగ్ అనంతరం చోటు చేసుకున్న పరిస్థితులపై సిట్ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా పోలింగ్ బూత్ లో ఏర్పాటు చేసిన వీడియోలను సిట్ అధికారులు పరిశీలిస్తోన్న సమయంలో పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన పుటేజ్ ను గుర్తించినట్లుగా టాక్ వినిపిస్తోంది.
అయితే, పిన్నెల్లి అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతోనే ఆ ప్రాంగణంలో ఉన్న పోలీసులు, ఏజెంట్లు ఎవరికీ ఫిర్యాదులు చేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. సిట్ దర్యాప్తుతోనే ఈ అంశం వెలుగులోకి వచ్చిందని లేదంటే ఈ అంశం తెరమరుగు అయి ఉండేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.