ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎవరైనా ఆర్తనాదాలు చేస్తూంటే.. ప్రత్యర్తి పార్టీకి ఎంతో హ్యాపీగా ఉంటుంది. గత ఎన్నికల్లో టీడీపీ గగ్గోలు పెట్టింది. వైసీపీ ఎంజాయ్ చేసింది. ఈ సారి రివర్స్ అయింది. వైసీపీ ఆర్తనాదాలు చేస్తోంది. టీడీపీ హ్యాపీగా చూస్తోంది. మాచర్ల ఇష్యూలో టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడిందని వైసీపీ నేతలు హఠాత్తుగా ఆరోపణలు చేయడం ప్రారంభించారు.
పిన్నెల్లి పరారీ తర్వాత టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడిందనే ఈవీఎం ధ్వంసం చేశారనే వాదనతో తెరపైకి వచ్చారు. ఒకరి తర్వాత ఒకరు అదే చెప్పారు. విదేశాలకు పోకుండా ఇక్కడే ఉన్న పల్నాడు నేతలంతా వెళ్లి ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ విదేశాల నుంచి సాక్షి మీడియాతో మాట్లాడి ఆరోపణలు చేశారు. అదే సమయంలో సోషల్ మీడియాలో టీడీపీ రిగ్గింగ్ పేరుతో ట్రెండింగ్ చేశారు. ఉత్తరాది అకౌంట్లు, విదేశీ అకౌంట్లతో చాలా ట్వీట్లు చేశారు. ఈ ట్రెండింగ్ చూసి టీడీపీ వర్గాలు మరింత సంతోషంగా ఉన్నాయి.
ఓటమికి కారణాలు చెప్పుకుంటూంటే తాము ఎందుకు డిస్ట్రబ్ చేయాలని వారు అనుకుంటున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత గెలుస్తామని గంభీరమైన ప్రకటనలు చేయడమే కాదు.. ఎన్నికల ప్రక్రియలో లోపాలు వెదుక్కోకూడదు. వెదుక్కుంటే ఘోరమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే.. ఓడిపోతామని తెలిసే రచ్చ చేస్తున్నారని అందరికీ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ప్రజలకు వైసీపీ నేతలు అదే క్లారిటీ ఇస్తున్నట్లుగా ఉన్నారు.