పరిపాలనలో తనదైన మార్క్ చూపించాలని భావిస్తోన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే కీలక మార్పులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన కొన్ని సంక్షేమ పథకాలను పక్కనపెట్టాలని,మరికొన్నింటి పేర్లు మార్చి వాటి స్థానంలో కొత్తవి అమలు చేసేలా కార్యాచరణ రూపొందించాలని భావిస్తున్నారు. ఈమేరకు రేవంత్ ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.
రైతుబంధును రైతు భరోసా, ఆసరా పెన్షన్ ను చేయూతగా… ఇలా మొత్తం పన్నెండు పాలసీలకు సంబంధించి మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో మన ఊరు – మన బడి పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించినా దానికి కేసీఆర్ సర్కార్ సరిగా నిధులు విడుదల చేయలేదు, దీంతో ఆ పథకం పేరు మార్చి దాని స్థానంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు అనే కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. టీఎస్ – ఐపాస్ పాలసీతో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని కేటీఆర్ గొప్పగా చెప్పుకున్న ఆ పాలసీని సైతం మార్చాలని రేవంత్ స్పష్టం చేశారు. ఆ ఒక్క పాలసీ స్థానంలో ఆరు పాలసీలు వస్తాయని , అందుకు తగ్గట్లుగా విధి, విధానాలు రూపొందించాలని అధికారులను రేవంత్ ఆదేశించారు.
మరోవైపు జిల్లాల వ్యవస్థీకరణ శాస్త్రీయంగా జరగలేదనేది ప్రభుత్వ వాదన. ఒకే అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉండే కొన్ని మండలాలు, వేర్వేరు ప్రాంతాల్లోకి వెళ్లాయని దీంతో ఎమ్మెల్యేలు అభివృద్ధి విషయంలో ఆయా జిల్లాల అధికారులతో సమన్వయము చేసుకోవడం ఇబ్బంది అవుతుందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 33 జిల్లాలను 17కు తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది.
ఎన్నికల కోడ్ ముగిశాక ఈ అంశంపై రేవంత్ దృష్టిసారించనున్నారని…ఆగస్ట్ లో పరిపాలన సంస్కరణలు చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది.