ఇదిగో అరెస్ట్ అనే సీన్ దగ్గర నుంచి ముందస్తు బెయిల్ వరకూ పిన్నెల్లి ఎపిసోడ్ సాగింది. చివరికి ఫలితాలు వచ్చే వరకూ ఆయనను అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని రిలీఫ్ ఫీలయ్యారు. మధ్యాహ్నం ఆయన ముందస్తు బెయిల్ కావాలంటూ లంచ్ మోషన్ దాఖలు చేశారు. వెంటనే హైకోర్టు విచారణ జరిపింది. పిన్నెల్లితో పాటు ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉన్న ఇతర నేతలకు ముందస్తు బెయిల్ ఇస్తూ న్యాయమూర్త నిర్ణయం ప్రకటించారు. ఐదో తేదీ వరకూ ఈ బెయిల్ ఉంటుంది.
సాక్షులను ప్రభావితం చేయరాదని.. అభ్యర్థులపై నిఘా పెట్టాలని ఈసీకి హైకోర్టు సూచించింది. నాలుగో తేదీన ఫలితాలు వస్తాయి. ఆ రోజున రాజకీయ పార్టీల భవితవ్యం తేలిపోతుంది. వైసీపీ ఓడిపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కనిపించకుండా పోయే అవకాశం ఉంది. ఇప్పటి తన పరారీని అప్పటికి వాయిదా వేసుకుంటారు. ఐదో తేదీ వరకూ ఆయనకు చాన్స్ ఉంది. నాలుగో తేదీన మధ్యాహ్నం కల్లా జాతకాలు తెలిసిపోతాయి. తాను తాను గెలిచినా వైసీపీ ఓడిపోతే ఆయన మాచర్లలో అడుగు పెట్టే పరిస్థితి ఉండదు. ఆయన ఓడిపోయి.. వైసీపీ కూడా ఓడిపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయలేం.
అందుకే పిన్నెల్లికి ఇప్పుడు ఎన్నికల ఫలితాల మీదే హోప్స్ ఉంటాయి. వైసీపీ ప్రభుత్వం నిలబడితేనే ఆయన ధీటుగా నిలబడి మాచర్లలో రాజకీయం చేయగలుగుతారు. అలాంటి పరిస్థితులు సృష్టించుకున్నారు. మొత్తంగా ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉన్నప్పటికీ ముందస్తు బెయిల్ వ్యూహంతోనే పోలీసు అధికారులను నియంత్రించినట్లుగా టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. మధ్యాహ్నం నర్సరావుపేటలో లొంగిపోతారని కూడా ప్రచారం చేశారు. పిన్నెల్లి ఇష్యూలో వ్యవస్థలన్నీ కలసి కట్టుగా ఆయనను కాపాడేందుకు ప్రయత్నించాయని..అంతిమంగా ఈసీనే అమాయకంగా నిబడిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.