తెలంగాణలో ‘ఆర్’ ట్యాక్స్ కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు ఆ గాలిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వైపు మళ్ళించడం చర్చనీయాంశం అవుతోంది.రాష్ట్రంలో యూ ట్యాక్స్ కొనసాగుతుందని గడిచిన కొన్ని రోజులుగా ఉత్తమ్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తోన్న మహేశ్వర్ రెడ్డి తాజాగా ఆ అవినీతిని నిరూపిస్తానని సవాల్ చేయడం బిగ్ డిబేట్ గా మారింది.
మంత్రి ఉత్తమ్ 800కోట్ల అవినీతికి పాల్పడ్డారని అందుకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశిస్తే వాటిన్నింటిని కమిటీకి అందిస్తానని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. రైస్ మిల్లర్లతో కుమ్మకై అవినీతికి పాల్పడ్డారని, ఉత్తమ్ అవినీతిపై దమ్ముంటే తనతో చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. వరుసగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఉత్తమ్ కుమార్ పై ఆరోపణలు చేస్తుండటంతో ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నిజంగా ఉత్తమ్ అవినీతికి పాల్పడ్డాడా..? లేదంటే ఉత్తమ్ లక్ష్యంగా కేవలం మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారా..? అనే చర్చ జరుగుతోంది. నిజానికి, మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో ఉనప్పుడు ఉత్తమ్ తో మంచి సాన్నిహిత్యం ఉండేది. ఉత్తమ్ వర్గంగా ముద్రపడిన ఆయన రేవంత్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందిన మహేశ్వర్ రెడ్డి ఇటీవల రేవంత్ ను మొదట టార్గెట్ చేస్తూ ఆర్ ట్యాక్స్ కొనసాగుతుందని బిగ్ బాంబ్ పేల్చారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే రేవంత్ తో భేటీ అయిన మహేశ్వర్ రెడ్డి ఆ తర్వాతే ఉత్తమ్ పై ఆరోపణలు చేస్తుండటం పట్ల రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.