కరణ్ థాపర్ తో ప్రశాంత్ కిషోర్ ఇంటర్యూ తర్వాత ఆయనపై రాజకీయవర్గాల్లో విస్తృతమైన దాడి జరుగుతోంది. ఆయన బీజేపీ కోసం పని చేస్తున్నారని ఆరోపించడం ప్రారంభించారు. దానికి కారణం బీజేపీకి సీట్లు తగ్గే అవకాశం లేదని ఆయన గట్టిగా చెబుతూండటం. అందుకే కాంగ్రెస్ తో పాటు ఇతర మిత్రపక్షాలు ఆయనను టార్గెట్ చేసుకున్నాయి. ఆయన ఇప్పటికే బెంగాల్ లో బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందని చెప్పడం ద్వారా తృణమూల్ కాంగ్రెస్ ఆగ్రహానికి గురయ్యారు. ఏపీలో వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని విశ్లేషించడం ద్వారా ఆయనను వైసీపీ నేతలు కూడా తిడుతున్నారు.
నిజానికి వీరందరికీ వ్యతిరేకంగా చెప్పాల్సిన అవసరం ప్రశాంత్ కిషోర్ కు ఏముంది ?. తన అనుభవంతో దేశంలో రాజకీయ పరిస్థితుల్ని విశ్లేషించారు. ఇప్పుడే కాదు ప్రతీ సారి చేస్తూనే ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఆయనను టార్గెట్ చేసింది. బీజేపీకి పని చేస్తున్న ప్పుడు కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. ఇక బీజేపీకి సేవలు చేస్తూనే పీకే స్ట్రాటజిస్టుగా వచ్చారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ హైకమాండ్ ఆయనను ఎన్ని మాటలన్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ పీకే తన మాటకే కట్టుబడ్డారు.
ప్రశాంత్ కిషోర్ కు ఇంత పేరు వచ్చిందంటే ఆయన నిక్కచ్చి తనమే కారణం. డబ్బులు తీసుకుని ఎవరో ఒకరి కోసం ఫేవర్ గా మాట్లాడుతూ వచ్చి ఉంటే ఇప్పటి వరకూ వచ్చి ఉండేవారు కాదు. ఎప్పుడో ఆయన కెరీర్ ముగిసిపోయి ఉండేది. స్ట్రాటజిస్టుగా ఆయన విరమించుకున్నారు ఇప్పుడు పని చేస్తానంటే వైసీపీ సహా ఇప్పుడు ఆయనను విమర్శిస్తున్న అన్ని పార్టీలు ఎంత బడ్జెట్ పెట్టి అయినా సరే హైర్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయన్నది నిజం.
ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తన అభిప్రాయాలను గట్టిగా చెబుతున్నారు. తప్పు అయితే తనపైనే మరక పడుతుందని నేరుగానే చెబుతున్నారు. తన ఎనలిటికల్, రాజకీయ స్థితులపై ఆయనకు ఉన్న అవగాహనపై.. ఆయనకు ఉన్న నమ్మకం అదే కావొచ్చు. ఫలితాల తర్వాత పీకే అంచనాలు కరెక్టా కాదా అన్న విషయం స్పష్టత వస్తుంది. తేడా వస్తే ఆయన తన పేరును తాను చెడగొట్టుకున్నట్లే.. నిజమైతే మరింత పేరు తెచ్చుకుంటారు !