టీడీపీ అద్యక్ష బాధ్యతలను నారా లోకేష్ కు అప్పగించాలని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కీలక నేత బుద్దా వెంకన్న ఇది రిక్వెస్ట్ కాదు మా డిమాండ్ అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు సారధ్యంలోని కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తుండటంతో బుద్దా వెంకన్న ఈ డిమాండ్ ను తాజాగా తెరమీదకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం అద్యక్షుడిగా కొనసాగుతోన్న అచ్చెన్నాయుడిని కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు కేబినెట్ లోకి తీసుకోవడం ఖాయం. దాంతో ఈ అద్యక్ష పదవిని లోకేష్ కు అప్పగించాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేస్తున్నారు. లోకేష్ కు మరోసారి మంత్రి పదవి వరించనుందని ప్రచారం జరుగుతోన్న వేళ అనూహ్యంగా ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది.
2019లో పార్టీ అధికారం కోల్పోయాక ఐదేళ్లుగా పార్టీ బలోపేతం కోసం లోకేష్ అవిశ్రాంతంగా పని చేస్తూ వచ్చారు. పాదయత్ర చేసి పరిణితి చెందిన నేతగా ప్రజల మన్ననలు పొందిన లోకేష్ అయితేనే పార్టీని మరింత పటిష్టం చేస్తారని ఆ పార్టీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. పైగా పార్టీలో లోకేష్ మరింత పట్టు సాధించేందుకు, భవిష్యత్ లో పార్టీని నడిపేందుకు ఇప్పుడే ఆయనకు బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి.
చూడాలి మరి.. కూటమి అధికారంలోకి వస్తే పార్టీతోపాటు ప్రభుత్వంలో చంద్రబాబు ఎలాంటి మార్పులు చేస్తారో..