తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఎవరిని నియమించాలనే దానిపై ఫోకస్ పెట్టిన అధిష్టానం పార్టీ నేతలతో చర్చిస్తోంది. లోక్ సభ ఎన్నికల తర్వాత పీసీసీ మార్పు ఉంటుందని సంకేతాలు పంపడంతో తాజాగా రేవంత్ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారని కొద్ది రోజులుగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
పీసీసీ పదవిని దక్కించుకునేందుకు ఎవరికీ వారు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్ నేతలు జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీలు పీసీసీ కోసం ప్రయత్నిస్తుండగా… అనూహ్యంగా సీతక్క వైపు పార్టీ అధిష్టానం వైపు మొగ్గు చూపుతుందన్న ప్రచారం జరుగుతోంది. సీతక్కకు కాకుండా ఇతరులకు ఎవరికీ ఇచ్చినా అభ్యంతరాలకు అవకాశం ఉండటంతో సీతక్క పేరును పార్టీ పరిశీలిస్తోందని, పైగా అందర్నీ కలుపుపోతుందని హైకమాండ్ భావిస్తోంది. అలాగే, సీతక్క పేరును పీసీసీకి రేవంత్ సైతం అంగీకరించనున్నారని పార్టీ పెద్దలు సమాలోచనలు జరుపుతున్నారు. సీతక్కకు కేవలం ములుగు ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఫేమ్ ఉండటంతో ఆమె పేరును హైకమాండ్ చర్చిస్తోందని టాక్.
సీతక్కకు పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా ఎస్టీ సామాజిక వర్గం ఆదరణ పొందటమే కాకుండా, మహిళల నుంచి కూడా పార్టీ పట్ల సానుకూలత ఉంటుందని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పీసీసీ చీఫ్ గా పని చేసినా తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందనున్నారు. ఆమెకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తే ఎవరి నుంచి వ్యతిరేకత రాదని కొందరి వాదన. అందుకే సీతక్క పేరును కాంగ్రెస్ పరిశీలిస్తుందని గాంధీ భవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, పార్టీ పగ్గాలను సీతక్క చేపట్టేందుకు అంగీకరిస్తుందా..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.