పంద్రాగస్టులోపు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా దూకుడు పెంచారు. ఈ విషయంపై చర్చించేందుకు కేబినెట్ సమావేశం నిర్వహించాలనుకున్న ఈసీ నుంచి అనుమతి రాకపోవడంతో అధికారుల స్థాయిలో రేవంత్ చర్చలు జరుపుతున్నారు.డిసెంబర్ తొమ్మిదిని కటాఫ్ తేదీగా తీసుకొని రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
అసలు వడ్డీతో కలిపి రెండు లక్షలను ఏకకాలంలో మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రెండు లక్షలకు మించి రుణాలు తీసుకుంటే మిగతా రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రైతు రుణమాఫీ అనేది కాంగ్రెస్ పేటెంట్ అని రేవంత్ స్పష్టం చేయడంతో గతంలో రైతు రుణమాఫీ విషయంలో వైఎస్సార్ అనుసరించిన పంథాలోనే మాఫీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను మాఫీ చేయలేదు. అంతకుముందు వైఎస్ హయాంలోని ప్రభుత్వం మాత్రం కొన్ని పరిమితులతో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను మాఫీ చేసింది. ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు రుణమాఫీని వర్తింపజేస్తుదా..? లేదా అని చర్చ జరుగుతోంది.
అయితే, వైఎస్ హయాంలో చేసినట్లుగానే బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను సైతం మాఫీ చేయాలని రేవంత్ భావిస్తున్నారు.రుణమాఫీ కోసం పెద్ద ఎత్తున నిధుల అవసరం ఏర్పడటంతో కార్పోరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఈ రుణమాఫీ ప్రక్రియను కంప్లీట్ చేయనుంది. రుణమాఫీ కోసం 30అంశాలతో ప్రొఫార్మా రెడీ చేసిన ప్రభుత్వం జూలైలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఈ అంశంపై అధికారిక ప్రకటన చేసి పెద్దఎత్తున ప్రచారం చేసుకోనున్నట్లుగా తెలుస్తోంది.