పార్టీ ఆవిర్భావం నుంచి కడప జిల్లాలో అప్రతిహతంగా విజయాల పరంపర కొనసాగిస్తోన్న వైసీపీ ఈసారి మాత్రం ఆందోళనతో కనిపిస్తోంది. గత ఎన్నికల మాదిరి పదికి పది స్థానాలు దక్కించుకోవడం కష్టమే అనే చర్చ ఆ పార్టీలోనే జరుగుతోంది.జిల్లాలోక్లీన్ స్వీప్ చేస్తామని వైసీపీ నేతలు చెబుతున్నా ఈసారి ఫలితాలు భిన్నంగా ఉండవచ్చునని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
కడప జిల్లాలోని కడప పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో పులివెందుల, బద్వేల్ పైన గట్టి నమ్మకంతో ఉన్న వైసీపీ… ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుడు , కడప అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంది. దీంతో ఈ టఫ్ ఫైట్ లో గెలుస్తుందన్న విశ్వాసం ఆ పార్టీ నేతల్లోనూ సన్నగిల్లుతోంది. అయితే, మైదుకూరు, కమలాపురం , ప్రొద్దుటూరులో టీడీపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇక, రాజంపేట పార్లమెంట్ పరిధిలోని రైల్వే కోడూరు, రాయచోటి, రాజంపేట అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి టీడీపీ నుంచి గట్టి పోటీ ఎదురైంది.పోలింగ్ భారీగా నమోదు కావడంతో తమకు అనుకూలంగా ఉంటుందని టీడీపీ లెక్కలు వేస్తుండగా.. అది తమకు అడ్వాంటేజ్ అని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. కడపలో కింగ్ మేకర్ గా ఉన్న వైసీపీ ఒకటి, రెండు చోట్ల ఓడినా ఆ పార్టీకి జిల్లాలో పట్టు సడలినట్లే. నైతికంగా జగన్ ఓడినట్లేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
వీటన్నింటి నేపథ్యంలో కడప జిల్లాలోని ఫలితాలపై వైసీపీలో కొంత టెన్షన్ కనిపిస్తోంది. గతంలోలాగా క్లీన్ స్వీప్ చేస్తామనే ప్రకటనలు చేసేందుకు కీలక నేతలు ఎవరూ సాహసించడం లేదంటే ఎక్కడో తేడా కొడుతుందనే టాక్ జిల్లాలో బలంగా వినిపిస్తోంది. వివేకా హత్య కేసు, షర్మిల ప్రచారం, ప్రభుత్వ వ్యతిరేకత అధికార వైసీపీపై తీవ్ర ప్రభావం చూపాయనే ప్రచారం జరుగుతోంది.