ఏపీలో ఎన్నికల ఫలితాలపై కోట్లాది రూపాయల బెట్టింగులు నడుస్తున్నాయి. బెట్టింగ్ రాయుళ్లు ఎవరూ వైసీపీని పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. అంతా కూటమి గెలుస్తుందని బెట్టింగ్ కాసేందుకు ఆసక్తి చూపుతుండటంతో అవతలి సైడ్ నుంచి బెట్టింగ్ కు ఛాన్స్ లేకుండా పోతోంది. దీంతో బెట్టింగ్ రాయుళ్లు ప్లాన్ మార్చేశారు.
వైసీపీ గెలుస్తుందా..? కూటమి గెలుస్తుందా..? అనే అంశాలను పక్కనపెట్టేసి అభ్యర్థుల మెజార్టీ విషయంలో బెట్టింగ్ కు దిగుతున్నారు. వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని ఆశిస్తోన్న చోట కూడా భారీ మెజార్టీతో గెలుస్తారని పందెం కాసేందుకు ఎవరూ ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తోంది. జగన్ ను మినహాయిస్తే ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు అవకాశాలు ఉన్న చోట కేవలం 10వేలకు మించి మెజార్టీ రాదని ఎక్కువ బెట్టింగ్ నడుస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఇక, టీడీపీ అభ్యర్థుల విషయానికి వస్తే చంద్రబాబుకు 50వేల మెజార్టీ, పవన్ కళ్యాణ్ కు 40 నుంచి 47 వేల వరకు, లోకేష్ కు 35 వేల నుంచి 42 వేల వరకు మెజారిటీ వచ్చే అవకాశం ఉందని ఎక్కువమంది బెట్టింగులు కడుతున్నారు. టీడీపీ కీలక నేతలు పోటీ చేసే స్థానాల్లోనూ మెజార్టీపై ఎక్కువ మొత్తంలో బెట్టింగ్ కాసేందుకు ఆసక్తి చూపిస్తుండగా… వైసీపీ అభ్యర్థుల మెజార్టీపై నామమాత్రపు బెట్టింగ్ కాస్తుండటం విశేషం.
వైసీపీ ఫైర్ బ్రాండ్స్ రోజా, అనిల్ కుమార్ యాదవ్ ,వల్లభనేని వంశీ, జోగి రమేష్, అంబటి రాంబాబు వంటి నేతలు పోటీ చేసే స్థానాల్లో బెట్టింగ్ రాయుళ్ళు వీరి ప్రత్యర్ధుల గెలుపుపై బెట్టింగ్ కు ఆసక్తి చూపిస్తుండటం విశేషం. దీంతో వారంతా ఓటమి జాబితాలో ఉన్నారని అవహగానకు వచ్చే ఈ బెట్టింగ్ లు కాస్తున్నారని తెలుస్తోంది.