తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలన్న ఆతృతతో బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఫేక్ ప్రచారాన్ని నమ్ముకుంది. ప్రతి విషయానికి రేవంత్ రెడ్డితో ముడి పెట్టడం.. తెలంగాణకు ఏదో అయిపోయిదన్నట్లుగా ప్రచారం చేస్తూండటం ఎబ్బెట్టుగా మారింది. చివరికి ఓ యువతీ యువకుడు బీర్లు తాగుతూ రోడ్డు మీద సంచరిస్తూంటే.. దాన్ని కూడా ప్రభుత్వ పనితీరుకు ముడిపెట్టేశారు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్. ఇలాంటి విపరీతం… అంతకంతకూ పెరిగిపోతోంది. ఫేక్ పోస్టులతో రోజూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.
రాను రాను ఇది మరీ ఘోరంగా మారడంతో రేవంత్ రెడ్డి పోలీసులకు సీరియస్ గా సూచనలు ఇచ్చారు. కేసులు పెట్టి అరెస్టు చేయాలని ఆదేశాలిచ్చారు.దాంతో పదుల సంఖ్యలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారు. దీనిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతంలో మీరు చేయలేదా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో రేవంత్ చేసిన ఆరోపణల్ని ప్రస్తావిస్తూ పెద్ద పెద్ద ట్వీట్లు పెట్టారు. అలా చేసినందుకు అరెస్టు చేయవద్దా అని కూడా ఆవేశపడ్డారు.
నిజానికి ఫేక్ ప్రచారాలు చేశారని.. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారని రేవంత్ రెడ్డిని పలుమార్లు అరెస్టు చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ వివరాలు బయట పెట్టినప్పుడు అరెస్ట్ చేసి చాలా రోజులు జైల్లో ఉంచారు. అయితే రాజకీయ ఆరోపణలు చేయడానికి ప్రభుత్వంపై ఫేక్ న్యూస్ లతో విరుచకుపడటానికి చాలా తేడా ఉంటుందని అనుకోవచ్చు. ప్రభుత్వంపై పోరాటం పేరుతో ఫేక్ ప్రచారంతో విరుచుకుపడితే క్యాడర్ కేసుల్లో ఇరుక్కోవడం తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు. గతంలో చేసిన పనుల వల్ల ప్రజల నుంచి సానుభూతి కూడా రావడం కష్టం.