మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ షరతులు మొదట్లోనే ఉల్లంఘించారు. ఆరో తేదీ వరకూ ఆయన నర్సరావుపేటలో మాత్రమే ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది . అయితే ఆయన నర్సరావుపేటకు చేరుకున్నట్లు కానీ అక్కడే ఉంటున్నట్లుగా కానీ ఎవరికీ సమాచారం ఇవ్వలేదు. అసలు ఎక్కడ ఉన్నారో స్పష్టత లేదు. ఇంత వరకూ పోలీసులకు..కోర్టులకు సమాచారం ఇవ్వలేదు.
పిన్నెల్లిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఆయనకు బెయిల్ ఒక్క ఈవీఎం ధ్వంసం కేసులోనే వచ్చింది. ఆయన బయట కనిపిస్తే మిగతా కేసుల్లో అరెస్టు చేయాలన్న ఒత్తిడి వస్తుందన్న ఉద్దేశంతో వైసీపీ హైకమాండ్ పెద్దలు ఆయనను ఆజ్ఞాతంలోనే ఉండాలని సలహా ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఆయన హైదరాబాద్ లో ఉన్నారా.. నర్సరావుపేటలో ఉన్నారా.. విదేశాల్లో ఉన్నారా అన్నదానిపై స్పష్టత లేదు.
వైసీపీ పెద్దలతో.. పోలీసు వర్గాల్లోని వైసీపీ సన్నిహితులతో ఆయన ఇప్పటికీ టచ్ లో ఉన్నారని అంటున్నారు. వారి సూచనల మేరకే తలదాచుకున్నారని .. బయటకు వచ్చినా ముప్పు లేదనుకున్నప్పుడే ఆయన బయటకు వస్తారని అంటున్నారు. ముందస్తు బెయిల్ కు వెళ్లడం వల్ల కోర్టు పెట్టిన షరతులతో పిన్నెల్లికి ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. ఫలితాలు అనుకూలంగా వస్తే తప్ప ఆయన బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు .