మాచర్లలో ఎంతో మంది హత్యకు గురి కావడానికి… మరెన్నో హత్యా ప్రయత్నాల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఉన్నారని రాష్ట్రమంతా గగ్గోలు పెడుతూంటే వైసీపీ కొత్త సిద్దాంతంతో తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యేను హత్య చేయడానికి టీడీపీ కుట్ర పన్నిందని పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెట్టారు. అందుకు పోలీసులు కూడా సాయం చేస్తున్నారట.
ఇంకా ఓడిపోకముందే ఇలా డీలా పడిపోయి తమ ఎమ్మెల్యేలను హత్య చేయాలనుకుంటున్నారని.. అందుకు పోలీసులు సహకరిస్తున్నారని చెప్పుకోవడం ఎవరికైనా కాస్త బాధగానే ఉంటుంది. అయితే పిన్నెల్లి అరెస్టు కాకుండా చూడాలనుకునే ప్రయత్నంలో దీనికి కూడా దిగజారిపోయారు. తాము ఓడిపోతామన్నట్లుగా.. తమ వారి ప్రాణాలు కాపాడాలన్నట్లుగా మాట్లాడటం ప్రారంభించారు.
ముందస్తు బెయిల్ తెచ్చుకున్న పిన్నెల్లి కోర్టు షరతుల ప్రకారం నర్సరావుపేటలో ఉండటం లేదు. ఆయన ఇంకా ఆజ్ఞాతం వీడలేదు. ఆయన ఎక్కడ ఉన్నారో వైసీపీ నేతలకు.. పోలీసు ఉన్నతాధికారులకు తెలుసని ఎక్కువ మంది నమ్ముతున్నారు. కోర్టు ఒక్కకేసులోనే ముందస్తు బెయిల్ ఇచ్చిందని ఆయనపై హత్యాయత్నం కేసులు పెండింగ్ లో ఉన్నాయని కనిపిస్తే అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీన్ని కవర్ చేసుకోవడానికి పిన్నెల్లి హత్యకు కుట్ర అంటూ… పేర్ని నాని మీడియా సమావేశం పెట్టి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మాచర్లలో పిన్నెల్లి చేసిన పనుల గురించి కొద్దిగా తెలుసుకున్న వారు కూడా ఆయనపై కనీస సానుభూతి చూపించే ప్రయత్నం చేయరు.