ఆగస్ట్ సంక్షోభం తప్పదని బీజేపీ నేతల హెచ్చరికలతో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక రాజకీయంపై అప్పుడే ఫోకస్ పెట్టారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సరేసరి, లేదంటే బీజేపీని ఎదుర్కోవడం ఎలా అనే అంశంపై దృష్టి సారించారు. రాష్ట్రంలో బీజేపీ డబుల్ డిజిట్ స్థానాలను కైవసం చేసుకుంటే దూకుడు పెంచుతుందని అంచనా వేస్తోన్న కాంగ్రెస్ అందుకు అడ్డుకట్టే వేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
మరోసారి ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే రేవంత్ ప్రభుత్వానికి చిక్కులు తప్పవని బీజేపీ నేతల వ్యాఖ్యలను కాంగ్రెస్ సీరియస్ గానే తీసుకుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి… ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్రలు చేస్తే కౌంటర్ గా ఏం చేయాలన్న దానిపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చేసే ప్రయత్నాలకు అడ్డుకట్టే వేస్తూనే బీజేపీ ఎత్తుగడలను నిర్వీర్యం చేసేలా ముందుకు సాగాలని భావిస్తున్నారు. బీజేపీకి ఏమాత్రం స్కోప్ ఇవ్వకుండా దూకుడుగా వ్యవహరించాలని లేదంటే ఆ పార్టీని కట్టడి చేయడం కష్టమని ఆ పార్టీలో అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ అంశంపై మరింత ఫోకస్ పెట్టబోతున్నారు రేవంత్. కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏర్పడితే రాష్ట్రానికి ఆశించిన మేర నిధుల కేటాయింపు ఉండదని , పైగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవచ్చునని అనుమానాలు ఉన్నాయి. దీంతో ఎన్డీయే సర్కార్ ఏర్పడితే మొదటి రోజు నుంచే బీజేపీపై యుద్ధం చేయాలని రేవంత్ అండ్ టీమ్ భావిస్తోంది. ఏ పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకుండా బీజేపీతో తలపడాలని ఫిక్స్ అయ్యారు. దీంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తెలంగాణలో ఎన్నికలను మించి పొలిటికల్ హీట్ పెరుగనుందని తెలుస్తోంది.