అనంతపురం ఏఆర్ అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఈ ఒక్క రెడ్డి మాత్రమే కాదు ఇంకా అనేక మంది ఉన్నతాధికారుల రాడార్లో ఉన్నారు. ఇప్పటికే చాలా మందిని విధులు నిర్వహించకుండా పక్కన పెట్టేశారు. వారిపై ఇతర అధికారులకు అజయమాయిషీ ఇచ్చారు. పలువురు వివాదాస్పద అధికారులపై నిఘా కొనసాగుతోంది. ఏపీ పోలీసు వ్యవస్థలో ఒక్క సారిగా వచ్చిన ఈ మార్పు డిపార్టుమెంట్లో చర్చనీయాంశమవుతోంది.
గత ఐదేళ్లుగా పోలీసు వ్యవస్థను ఓ క్రిమినల్ ఎక్స్ పర్ట్ ఎలా ఉపయోగించుకోగలడో వైసీపీ అలా ఉపయోగించుకుందన్న అభిప్రాయం ఉంది. అభియోగాలు ఉన్న ఆఫీసర్లను, పోస్టింగ్లు, డబ్బులు, విలాసాలకు లొంగిపోయేవారిని పట్టుకుని ఏరికోరి కీలక పోస్టుల్లో నియమించి తమకు కావాల్సిన పనులు చేయించుకునేవారు. వీరంతా చెలరేగిపోయేవారు. తమ ప్రధాన విధి శాంతిభద్రతలను కాపాడటంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శించారు. చివరికి ఎన్నికల్లో స్వామిభక్తిని ప్రదర్శించి .. అరాచకశక్తులకు ప్రోత్సాహం ఇవ్వడంతో మొదటికే మోసం వచ్చింది. ఇప్పుడు వరుసగా ఒక్కొక్కర్ని కలుగులోంచి బయటకు లాగుతున్నారు.
ప్రభుత్వం మారడం ఖాయమని తెలియడంతో వైసీపీ పెద్దల మాటల్ని కొంత మంది ఉన్నతాధికారులు అసలు ఖాతరు చేయడం లేదు. సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. అయితే కొంత మంది మాత్రం… ప్రభుత్వం మారితే ఇబ్బంది పడుతామని అనుకుటున్న వారు మాత్రం ఇంకా… కొంత మందిని ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరు ఎన్ని చేసినా డిపార్టుమెంట్ లో మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తోందన్న అభిప్రాయం పోలీసు వర్గాల్లో ఉంది.
ఎక్కడ ఏ పోలీసు వ్యవహారం అయినా.. మీడియాతో మాట్లాడినా.. తెర ముందుకు వచ్చినా ఓ రెడ్డి సామాజికవర్గ అధికారే ఉంటారు. సిక్కోలు నుంచి కడప వరకూ అదే ట్రెండ్. ఇప్పుడు మెల్లగా అది మారుతోందని… పోలీసు వ్యవస్థ సంస్కరణల దిశగా వెళ్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. నాలుగో తేదీ తర్వాత అసలు మ్యాజిక్ ఉండే అవకాశం ఉంది.