2019 ఎన్నికలప్పుడు ఏపీలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతోంది. అప్పట్లో అధికార పార్టీగా ఉన్న టీడీపీ ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేసింది. ఇప్పుడు అధికార పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీ అదే పని చేస్తోంది. ఎన్నికలు సక్రమంగా జరగలేదని అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఈసీపై నానా యాగీ చేశారు. ఎన్ని జరిగినా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేసేవారు.
ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా అదే అంటోంది. పోలింగ్ ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే.. తమ ఫ్లాగ్ షిప్ నినాదం 175కి 175 గెలుస్తామని అంటోంది. అయితే ఈ పరిణామాలు మాత్రం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. 2019లో ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ ద్వివేదీ ఉండేవారు. డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్ సహా చాలా జిల్లాల్లో ఎస్పీలను మార్చేశారు. చివరికి చీఫ్ సెక్రటరీని కూడా మార్చేశారు. వైఎస్ వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న కడప ఎస్పీని కూడా ఈసీ బదిలీ చేసింది. అలాగే ఎన్నికల ప్రక్రియలో లోపాలపై టీడీపీ మండిపడింది. పోలింగ్ రోజు కొన్ని వందల చోట్ల ఈవీఎం మెషిన్లలో లోపాలు బయట పడ్డాయి. ఈ కారణంగా పోలింగ్ కూడా ఆలస్యమయింది. ఈ పరిణామాలన్నింటితో ఈసీపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. సీఈవో కార్యాలయానికి వెళ్లి ధర్నా చేసినంత పని చేశారు. ఇప్పుడు ఆ పని వైసీపీ చేస్తోంది.
తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసిందని ఆరోపిస్తున్నారు. టీడీపీ భారీగా రిగ్గింగ్ చేసిందన్న అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. ఎక్స్ లో ట్రెండింగ్ లోకి కూడా తెచ్చారు. రీపోలింగ్ కావాలంటున్నారు. కానీ టీడీపీ వద్దంటోంది. గతంలో కోరుకుని మరీ చంద్రగిరిలో నాలుగు చోట్ల రీపోలింగ్ పెట్టించారు.కానీ ఈ సారి ఈసీ తమ వీడియో రిలీజ్ చేసిందని గగ్గోలు పెడుతున్నారు.
ఈ పరిణామాలన్నీ చూస్తే నాడు టీడీపీ పాత్రలో నేడు వైసీపీ ఉందని సులువుగా అర్థమవుతుంది. ఫలితాలు కూడా అలాగే వస్తే ఖర్మ ఈజ్ వైజాగ్ బీచ్ అని వైసీపీ అనుకోవాల్సి వస్తుందేమో ?