‘రీషూట్లు తప్పు కాదు.. అది మేకింగ్‌లో ఓ పార్ట్’ అని చెప్పుకొంటుంటారు దర్శక నిర్మాతలు. కానీ… ఎక్కువ రీషూట్లు జరుపుకొన్న సినిమా ఒక్కటి కూడా ఆడిన దాఖలాలు లేవు. రీషూట్లు ఎక్కువయ్యే కొద్దీ బడ్జెట్ పెరిగిపోతుంది. దర్శకుడిలో క్లారిటీ లేకపోవడం, నిర్మాతలకు సినిమాపై నమ్మకం కుదరకపోవడం వల్లే ఈ రీషూట్ల తంతు మొదలవుతోంది. ఈమధ్య దిల్ రాజు కాంపౌండ్ లో కూడా రీషూట్ల హడావుడి కాస్త ఎక్కువ కనిపిస్తోంది. ‘ది ఫ్యామిలీ స్టార్’లో కొన్ని సన్నివేశాల్ని రీషూట్ చేసినట్టు అప్పట్లో చెప్పుకొన్నారు. శంకర్ ‘గేమ్ ఛేంజర్’దీ ఇదే పరిస్థితి. ఇటీవల విడుదలైన ‘లవ్ మి’ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమా ఎప్పుడో రెడీ అయ్యింది. అయితే.. దిల్ రాజు కొన్ని మార్పులూ, చేర్పులూ సూచించిన పిదప… సినిమా రీషూట్లకు వెళ్లింది. అయితే ఎన్ని దఫాలు తీసిందే తీసినా.. రిజల్ట్ రాలేదు.
దిల్ రాజు కాంపౌండ్లోనే తెరకెక్కుతున్న మరో సినిమా.. ‘ఆకాశం దాటి వస్తావా’. కొరియోగ్రాఫర్ యశ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇది కూడా ఎప్పటి సినిమానో. ఇంకా విడుదలకు నోచుకోలేదు. దానికి కారణం… రీషూట్ల మీద రీషూట్లు జరుపుకోవడమే. షూటింగ్ పూర్తయ్యాక దిల్ రాజు రంగంలోకి దిగడం, ఆ తరవాత రిపేర్లు మొదలెట్టడంతో, రీషూట్ల పర్వానికి శ్రీకారం చుట్టుకొంది. ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు బయటకు వస్తుందో చెప్పలేని పరిస్థితి. పోనీ రీషూట్ల తరవాతైనా సినిమాల జాతకాలు మారాయా అంటే అదీ లేదు. ఇది వరకు దిల్ రాజు వ్యవహారం వేరుగా ఉండేది. స్క్రిప్టు దశలోనే దాన్ని పోస్ట్ మార్టమ్ చేసేసేవారు. ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూడా మార్పులూ చేర్పులూ జరిగేవి. అందుకే రీషూట్ల తంతు ఉండేది కాదు. ఇప్పుడు దిల్ రాజు చేతిలో సినిమాలు ఎక్కువైపోవడం వల్ల, కొన్ని బాధ్యతలు కొందరిపై వదిలేస్తున్నారు. లూజ్ హ్యాండ్స్ వల్ల… అనుకొన్న సినిమాలు అనుకొన్నట్టు రావడం లేదు. అందుకే ఇకపై తన సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని దిల్ రాజు డిసైడ్ అయిపోయారని టాక్. ఈమాత్రం అప్రమత్తం అవ్వకపోతే.. దిల్ రాజు బ్యానర్ ప్రతిష్ట దెబ్బతింటుంది మరి!