తెలంగాణలో కేసీఆర్ సర్కార్ హాయంలో ఫోన్ ట్యాపింగ్ అయిందన్న విషయం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తూనే ఉంది. ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు బీఆర్ఎస్ నేతల ఫోన్లు కూడ ట్యాప్ చేశామని, పెద్దాయన చెప్పిన దాని ప్రకారమే ట్యాప్ చేసినట్లు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో స్వయంగా ఒప్పుకున్నారు.
ఈ ఫోన్ ట్యాపింగ్ ను ఎవరు చెప్తే, ఎందు కోసం, ఎవరి కోసం ట్యాప్ చేశామో… వివరంగా చెప్పుకొచ్చారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పేర్లను రాధాకిషన్ రావు కోట్ చేసినట్లు తెలుస్తోంది.
కేటీఆర్ కు సన్నిహితంగా ఉండే ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద, కడియం శ్రీహరి, రాజయ్య, పట్నం సోదరులు, పైలట్ రోహిత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, సరితా తిరుపతయ్య, జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి, రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరులు, ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి, వంశీకృష్ణ తో పాటు బీజేపీ నేతలు ఈటల, బండి సంజయ్, అర్వింద్ ఫోన్లు ట్యాప్ చేసినట్లు వాంగ్మూలంలో పేర్కొన్నారు.
ఇక వీరితో పాటు పలువురు మీడియా అధినేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశామని… మాజీ మంత్రి హరీష్ రావు సూచనతో ప్రణీత్ రావుతో ఓ మీడియా అధినేత టచ్ లో ఉన్నారని రాధాకిషన్ రావు వాంగ్మూలంలో పేర్కొన్నారు. డైరెక్ట్ కాల్స్ తో పాటు వాట్సాప్, స్నాప్ చాట్ కాల్ డేటాలపై కూడా నిఘా పెట్టినట్లు రాధాకిషన్ రావు ఒప్పుకున్నారు.