వైసీపీ నేతల మాటలకు అర్థాలే వేరులే అని ఇప్పుడిప్పుడే ఏపీ ప్రజలకు తెలిసివస్తోంది. ప్రత్యర్ధులపై దాడులు చేయడం.. మాకేం సంబంధం లేదని అనడం. ఈవీఎంను ధ్వంసం చేయడం..ఎన్నికలను సజావుగా నిర్వహించలేదని విమర్శించడం. ఇవన్నీ చూస్తే వైసీపీ నీతి వ్యాఖ్యలను వల్లిస్తుంది కానీ, ఆచరణకు మాత్రం దూరంగా ఉంటుందని స్పష్టం అవుతోంది.
పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికలు సజావుగా నిర్వహించలేదని…రిగ్గింగ్ జరిగిందని రీపోలింగ్ కు అంబటి, అనిల్ కుమార్ యాదవ్ లు డిమాండ్ చేశారు. ఈసీ ఉదాసీన వైఖరే రాష్ట్రంలో అల్లర్లకు కారణమని ఆరోపించారు. రాష్ట్రం రావణాకాష్టంలా మారిందని తెగ ఇదైపోయారు. అంతలోనే ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసిన ఘటన వెలుగులోకి రావడంతో వైసీపీ లీడర్లు గప్ చుప్ అయ్యారు.
ఇలా వైసీపీ నేతల లీలలపై ప్రజల్లో చర్చ నడుస్తుండగా ఆ పార్టీ నేతలు డబ్బులు పంచిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఎన్నికల ప్రచార సమయంలో సర్వేపల్లిలో టీడీపీ గెలిచేందుకు అడ్డదారులు తొక్కిందని ఆరోపించిన మంత్రి కాకాణి ఇప్పుడు దొరికిపోయారు. వరిగొండలో నగదు వైసీపీ పంపిణీ చేస్తున్న వీడియోలు బయటకు రావడంతో జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఏడుగురు వైసీపీ నేతలపై కేసు నమోదైంది.
అయితే, కేసులు నమోదు చేయడం పట్ల కాకాణి అధికారులపై ఫైర్ అయ్యారు. ఎన్నికలను సజావుగా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేలా ప్రయత్నించినట్లు వీడియోలు బయటకు వచ్చినా ఇంకా అధికారులపైనే ఆరోపణలు చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. దీంతో వైసీపీ నేతల మాటలకు అర్థాలే వేరులే అంటూ జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు.