కథానాయకుడికి ఓ లోపం ఉండడం, దాని చుట్టూ కథ నడపడం ఓ ఫార్ములా. ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’ ఇలాంటి పాయింట్ నే ఎంటర్టైన్మెంట్ జోడించి తీశారు. అవి రెండూ హిట్టయ్యాయి. ‘రంగస్థలం’ మరో కథ. ఈ సినిమాలో చరణ్ కు సరిగా వినపడదు. అయితే ఆ పాయింట్ ని సుకుమార్ చాలా తెలివిగా వాడుకొన్నాడు. స్క్రీన్ ప్లేలో ఆ లోపాన్ని వాడుకొని, కథా గమనాన్నే మార్చేశాడు సుకుమార్.
‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ క్యారెక్టర్‌కీ ఇదే ఫార్ములా వాడుతున్నాడు శంకర్. ఈ సినిమాలో హీరోకి నత్తి. ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఛాలెంజింగ్ వ్యవహారమే. చరణ్ కూడా అందుకే ఒప్పుకొన్నాడేమో. అయితే నత్తితో చాలా డేంజర్. హీరో ఎగ్రసీవ్ గా లేకపోతే, ఫ్యాన్స్ తట్టుకోలేరు. నత్తితో హీరోయిజం ఎలా ఎలివేట్ అవుతుందో అన్నది చరణ్ ఫ్యాన్స్ భయం. కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ‘ఆపద్భాంధవుడు’లోని కొన్ని సీన్లలో చిరు నత్తితో మాట్లాడతాడు. కాసేపే అయినా ఆ సన్నివేశాల్ని చిరు ఫ్యాన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారు. ‘లైగర్’లో కూడా ఇదే జరిగింది. అందులో విజయ్ దేవరకొండకు నత్తి. ఆ పాయింట్ దగ్గరే సినిమా ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ విషయంలో ఏం జరుగుతోందో అనే ఆందోళన చరణ్ అభిమానులకు ఉండడం సహజం. అయితే ఇక్కడే దర్శకుడు శంకర్ తన తెలివితేటల్ని ప్రదర్శించారు. ఇందులో చరణ్ ది ద్విపాత్రాభినయం. తండ్రీ కొడుకులుగా నటిస్తున్నాడు. తండ్రి పాత్ర ఫ్లాష్ బ్యాక్‌లో వస్తుంది. ఆ పాత్రకే నత్తిని పెట్టాడు. అంటే పది పదిహేను నిమిషాల స్పేస్ ని మాత్రమే నత్తి కోసం వాడుకొన్నాడు. పైగా సుకుమార్లానే శంకర్ కూడా హీరో లోపాన్ని చాలా తెలివిగా వాడుకొన్నాడని, సినిమా చూశాక.. హీరో ఈ లోపంతో బాధ పడకపోతే, కథ ఇలా సాగేది కాదు కదా… అనే క్లారిటీ ప్రేక్షకులకు వస్తుందని తెలుస్తోంది. స్వతహాగా శంకర్ సినిమాల్లో హీరోలు డైనమిక్‌గా ఉంటారు. హీరోల ఇమేజ్‌ని ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్లడం శంకర్ స్టైల్. ఆయన తన హీరోకి ఇలాంటి లోపం పెట్టాడంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అదేంటన్నది సినిమా విడుదలయ్యేంత వరకూ తెలీదు.