అకారణంగా గత నాలుగున్నరేళ్లుగా సస్పెన్షన్లో ఉన్న డీజీ స్థాయి అధికారి న్యాయం కోసం కిందామీదా పడాల్సి వస్తోంది. హైకోర్టు, సుప్రీంకోర్టు, క్యాట్ ఇలా అన్నీ చెప్పినా ఆయనకు న్యాయం జరగడం లేదు. తిరిగి తిరిగి మళ్లీ వ్యవస్థల్లో ఆగిపోతోంది. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రోజునే హైకోర్టులో విచారణ జరిగింది. ముందస్తు బెయిల్ వచ్చింది. అంతకు రెండు రోజుల ముందే ఏబీవీ పై ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ కూడా పిన్నెల్లి బెయిల్ పిటిషన్పై విచారణ జరిగిన రోజే జరిగింది. కానీ ఇప్పటి వరకూ తీర్పు రాలేదు.
క్యాట్ తీర్పులో సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన అని స్పష్టంగా ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ఏ మత్రం పట్టించుకోకుండా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నెలాకరులో రిటైరవుతున్న ఆయనను .. సస్పెన్షన్ లో ఉండగానే రిటైర్ అయ్యేలా చేయాలని కుట్ర పన్నారు. దానికి తగ్గట్లుగానే పరిస్థితులు నడుస్తున్నాయి. ఇప్పుడు హైకోర్టు క్యాట్ తీర్పు అమలు చేయాల్సిందేనని తీర్పు ఇచ్చినా ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వదు. ఎందుకంటే నాలుగు రోజులే సమయం ఉంది. ఈ లోపు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశామని ఊరుకోవచ్చు. ఎలా చూసినా ఏబీవీకి అన్యాయం చేయాలనుకుంటున్నారు.. చేసేస్తున్నారు. ఏ ఒక్క వ్యవస్థ కూడా దీన్ని అడ్డుకోలేకపోతోంది.
ప్రభుత్వాలు సివిల్ సర్వీస్ అధికారుల్ని ఎంత ఈజీగా టార్గెట్ చేసకోవచ్చో.. ఏబీవీ దుస్థితిని చూస్తే అర్థమైపోతుంది. ఆయనేమీ చిన్న అధికారి కాదు డీజీ స్థాయి అధికారి. సర్వీసులో ఇంత వరకూ రిమార్క్స్ లేవు. ప్రస్తుత ప్రభుత్వం చేసిన తప్పుడు ఆరోపణలు తప్ప.. ఒక్క సాక్ష్యం చూపించలేదు. వచ్చే ప్రభుత్వాలు.. సివిల్ సర్వీస్ అధికారుల్ని ఎంత సులువుగా వేధించవచ్చో.. ఇదే కేసు స్టడీగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని వాళ్లే సృష్టించుకున్నారు. ముందు ముందు ఎంతో మంది సివిల్ సర్వీస్ అధికారులు ఏబీవీ తరహాలో వేధింపులకు గుర్యయే ప్రమాదం ఉంది.