అందెశ్రీ రాసిన పాటని తెలంగాణ రాష్ట్ర గీతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. అంత వరకూ బాగానే ఉంది. అయితే ఈ పాటని స్వర పరిచే అవకాశం కీరవాణికి అప్పగించారు. కీరవాణి గొప్ప సంగీత దర్శకుడు. తెలుగు సినిమా రంగంలో ప్రసిద్దుడు. వివాహ రహితుడు. అంతకంటే మించి, ఆస్కార్ విజేత. అంత వరకూ బాగానే ఉంది. కానీ ఆయన ఆంధ్రుడు. ఓ తెలంగాణ గీతాన్ని స్వర పరిచే అవకాశం ఓ ఆంధ్రుడికి ఇవ్వడం ఏమిటి? అది తెలంగాణ కళాకారుల్ని అగౌరవ పరిచినట్టే అనేది తెలంగాణ వాదుల మాట. తెలంగాణ సినీ సంగీత సంఘం కూడా ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నివేదిస్తూ ఓ లేఖ రాసింది.
అందెశ్రీ లాంటి ప్రజా కవులు, పాట రాస్తూనే బాణీ కట్టేస్తారు. అలాంటప్పుడు ప్రత్యేకంగా స్వర పర్చడం అంటూ ఏమీ ఉండదు. కానీ ఆ పాట ప్రజల నోళ్లలో నిలిచిపోవాలన్న మంచి ఉద్దేశంతో పాటకు సంబంధించి మరింత కసరత్తు చేస్తున్నారు. అదంతా బాగానే ఉంది. తెలంగాణలో ఇంతమంది సంగీత కారులు ఉండగా, కీరవాణినే ఎందుకన్నది ఇక్కడి వాళ్ల ప్రశ్న. పైగా పాటని కూడా ఆంధ్రా గాయకుడితో పాడించడాన్ని కూడా తప్పుపడుతున్నారు. సంగీతం విషయంలో కుల, మత, ప్రాంత బేధాలుండవు. కాకపోతే…. తెలంగాణ అనేది చాలా సున్నితమైన అంశం. దాన్ని కదిపితే తేనెతుట్టె కదిపినట్టే. అందుకే ఇలాంటి విషయాల్లో ఎవరి మనోభావాలూ దెబ్బతినకుండా నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఈ చర్చ కీరవాణిని ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం. వివాదాలకు దూరంగా ఉండాలనుకొనే కీరవాణి, ఇప్పుడు ఈ పాటని కంపోజ్ చేస్తారా, చేసినా ఆ క్రెడిట్ తీసుకొంటారా అనే చర్చ తెలుగు సినిమా సర్కిల్స్ లో సాగుతోందిప్పుడు.