హీరోలు ఈమధ్య మేకొవర్లపై ఎక్కువ దృష్టి పెట్టారు. పుష్షతో బన్నీ, దసరాతో నాని… తమ మేకొవర్తో షాక్ ఇచ్చారు. ఇదివరకెప్పుడూ లేనంత మాస్ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. ఆ రెండు చిత్రాలూ ఆయా హీరోల కెరీర్లో మైల్ స్టోన్స్ గా మిగిలిపోయాయి. ఇప్పుడు `అల్లరి` నరేష్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. నరేష్ తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. సుబ్బు ఈ చిత్రానికి దర్శకుడు రాజేష్ దండా నిర్మాత. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. మాసిన గడ్డంతో, రిక్షా మీద కూర్చున్న నరేష్ సిగరెట్ పొగలు వదులుతున్న దృశ్యమది. నరేష్ అవతారం రగ్గడ్ గా ఉంది. ఇలాంటి మాస్ గెటప్పులో నరేష్‌ని ఇప్పటి వరకూ చూళ్లేదు. కాబట్టి ఆ గెటప్ కొత్తగానే అనిపిస్తుంది. నరేష్ క్యారెక్టరైజేషన్ కూడా అదే స్థాయిలో ఉండబోతోందని తెలుస్తోంది. 1980ల నాటి కథ ఇది. ఆనాటి వాతావరణాన్ని సృశిస్తూ భారీ సెట్లు కూడా వేశారు. ఇటీవల జాతర సెటప్ లో ఓ ఫైట్ తీర్చిదిద్దారు. ఆ ఫైట్ కూడా ఈ చిత్రానికి హైలెట్ కానుందని సమాచారం. విశాల్ చంద్ర శేఖర్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే టీజర్ వదులుతారు.